● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 82, పీఏసీఎస్ 65, మెప్మా 5, ఎఫ్‌పీఓఓ ఏడు, ఏఎంసీ ఆధ్వర్యంలో ఒకటి మొత్తం 160 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలకుండా ఆరు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం సేకరిస్తామన్నారు. క్వింటా గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించామని, సన్న రకం వరి క్వింటాకు రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తామని తెలిపారు. కేంద్రాలను కాస్త ఎతైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల సౌకర్యార్థం తాగునీరు, నీడ, మూత్రశాలలు తదితర మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి కేంద్రంలో కచ్చితంగా 2 ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు, 30 టార్పాలిన్లు, 1 ప్యాడీ క్లీనర్ అందుబాటులో ఉంచాలని, ప్యాడీ క్లీనర్ లేకుంటే ట్రాక్టర్ మౌంటెడ్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, కౌలు రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాలని తెలిపారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరు లారీల్లో తరలించాలని.. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని.. కొనుగోలు పూర్తయిన వెంటనే సంబంధిత రైతుకు తూకం వివరాలతో కూడిన కొనుగోలు పత్రం అందజేయాలని తెలిపారు. జిల్లాలో కేటాయించిన రైస్‌మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజు కొనుగోలు కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ, రైస్‌మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం సైదులు, డీసీఓ ప్రసాదరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


