రేషన్‌ బియ్యం పక్కదారి? | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పక్కదారి?

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

అధికారుల పర్యవేక్షణ కరువు రైస్‌మిల్లుల్లో రీ సైక్లింగ్‌ ?

రెండేళ్లలో 60 కేసులు నమోదు..

778 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

నారాయణపేట: లబ్ధిదారులకు ఏప్రిల్‌, మే, జూన్‌ కోటా రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 301 రేషన్‌ దుకాణాల్లో 1,70,641 రేషన్‌ కార్డులు ఉన్నాయి. మూడు నెలలకుగాను 11,972 ఎంటీఎస్‌ బియ్యం పంపిణీ చేయనున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినా.. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా తరచూ పట్టుబడుతున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. అయితే బియ్యం మూడు నెలల కోటా రావడం.. అందులో ఎంతోకొంత పక్కాదారి పట్టించి వాటాలు పంచుకుందామనే ఓ అధికారి లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

అధికారుల పర్యవేక్షణ కరువు..

చౌకధర దుకణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని చెప్పవచ్చు. రెండేళ్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బియ్యాన్ని పట్టుకున్నారే తప్ప స్థానిక అధికారులు మాత్రం తనిఖీలు చేయడం లేదనిపిస్తోంది. రేషన్‌ దుకాణాలను తనిఖీ చేసి విక్రయాలు, నిల్వలకు వ్యత్యాసం ఉంటే వెంటనే సదరు డీలర్‌పై కేసు నమోదు చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు కనబడటం లేదు. వ్యాపారులు అధికారులను మచ్చిక చేసుకొని ఈ దందా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సరిహద్దులు దాటిస్తూ..

కొందరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని రావల్‌పల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం కానుకుర్తి, నారాయణపేట మండలంలో జలాల్‌పూర్‌, ఎక్లాస్‌పూర్‌, మక్తల్‌ నియోజకవర్గంలో ఊట్కూర్‌ మండలంలోని సంస్తాపూర్‌, మక్తల్‌, మాగనూర్‌ మండలాల సరిహద్దులో ఉజ్జెలి, కృష్ణా మండలం టై రోడ్డు తదితర సరిహద్దు మార్గాల్లో బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. అటు రాయిచూర్‌, ఇటు యాద్గిర్‌, గుర్మిట్కల్‌ ప్రాంతాలకు అక్రమ వ్యాపారులు రాత్రి వేళలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపడుతుందగా 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది.

డీలర్లే దళారులుగా మారి..?

జిల్లాలోని చాలామంది లబ్ధిదారులు డీలర్‌ వద్ద బియ్యం తీసుకొని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి మూడు నెలల కోటా బియ్యం రావడంతో బియ్యం బయట ఎందుకు అమ్ముతారు.. ఆ ధర ఎంతో తామే ఇస్తామంటూ పలువురు డీలర్లు సైతం అక్రమ సంపాదనకు తెర తీసినట్లు సమాచారం. ప్రధానంగా దామరగిద్ద, మద్దూర్‌, ఊట్కూర్‌, మక్తల్‌, మాగనూర్‌, కృష్ణా మండలాలతో పాటు తండాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులు దళారులను పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. చౌక బియ్యం తినని లబ్ధిదారులను గుర్తించి పలువురు డీలర్లే లబ్ధిదారుల నుంచి రూ.15 నుంచి రూ.20 వరకు కొంటున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో ఉంచి ఒకేసారి పెద్దమొత్తంలో బడా వ్యాపారులు, రైసుమిల్లర్లకు కిలో రూ.22 నుంచి రూ.25 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్రమంగాతరలిస్తే చర్యలు..

రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించిన.. డీలర్లు కొనుగోలు చేసినా.. ఇతరులకు విక్రయించినా.. చట్టరీత్యా చర్యలు తప్పవు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇకపై నిఘా పెంచుతాం.

– సైదులు, సివిల్‌ సప్లయ్‌ డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement