● ఆలయాల్లో ప్రత్యేక పూజలు..పంచాంగ శ్రవణాలు
● వ్యవసాయ పనులు ప్రారంభించిన అన్నదాతలు
నారాయణపేట: జిల్లా ప్రజలు గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇళ్ల లోగిళ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త దుస్తులు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆలయాల్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలోని పరిమళాపురం రాఘవేంద్రస్వామి ఆలయం, శక్తిపీఠంలో వ్యవస్థాపకుడు డా. ఊట్కూర్ శాంతానంద్ పురోహిత్, శివలింగేశ్వర ఆలయంలో వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శివకుమార్‌స్వామి పంచాంగ శ్రావణం చేశారు. కొత్త సంవత్సరంలో కాలగణన, రాశిఫలాలు, వ్యవసాయ ఫలితాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రైతులు వ్యవసాయ సామగ్రి, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులు ప్రారంభించారు.
శక్తిపీఠంలో ఉగాది పురస్కారాలు..
జిల్లాకేంద్రంలోని శక్తిపీఠంలో ఉన్న శారదాంబ కల్యాణ మండపంలో గురువారం ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, సంగీత, చిత్రకారులు, నృత్యం తదితర రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేసి సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖ అధ్యాత్మిక, సామాజిక, రాజకీయవేత్త కృష్ణాకు చెందిన అమర్ దీక్షిత్, మక్తల్‌కు చెందిన ప్రముఖ నాట్యాచారుడు హరతి గోపాలచార్య, ప్రముఖ అధ్యాత్మికవేత్త కరణం రాఘవేంద్రచార్య, ప్రముఖ సినీ సీరియల్ నటుడు చింతచెట్టు నారాయణరెడ్డి, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పవన్‌శేషు, ప్రముఖ చిత్రకారుడు నీమ్‌కర్ రమేష్ ఉన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.


