నర్వ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు చేరువ చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌మిషన్–100 పేరిట వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం నుంచి జూన్ 27 వరకు అన్ని వయస్సుల వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పీహెచ్‌సీ వైద్యులు, ఆర్‌బీఎస్‌కే బృందాలు, ఇతర వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. గతంలో మహిళలకు స్వస్త్‌నారి పేరిట ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందరికీ నిర్వహిస్తారు.
కార్యక్రమ ఉద్దేశం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి హెల్త్‌మిషన్ 100 అనే వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ప్రజలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగా గుర్తించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), మొబైల్ మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. ఇందులో రక్తహీనత (అనీమియా), క్యాన్సర్, క్షయ, డెంగీ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. పిల్లలకు అవసరమైన టీకాలు (ఇమ్యునైజేషన్) చేయడం కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపర్చడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణాల్లో ఉన్న అర్బన్ పీహెచ్‌సీలను పాలిక్లీనిక్‌లుగా అభివృద్ధి చేయడం కూడా కార్యక్రమ లక్ష్యాల్లో ఒకటి. ప్రతి మహిళకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొదించడం, 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు.
నాలుగు దశల్లో..
మొదటి దశలో గర్భిణులు, బాలురు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు, టీకాలు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వయోవృద్ధుల కోసం శిబిరాలు నిర్వహించనున్నారు.
రెండో దశలో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక రోగాల నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలు, మందులు అందిస్తారు.
మూడో దశలో సంక్రమణ వ్యాధులైన క్షయ, ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు పీహెచ్‌సీలలో హీట్ స్ట్రోక్ నిర్వహణ గదులు ఏర్పాటు చేయనున్నారు.
నాలుగు దశలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల్లో నిపుణులైన వైద్యుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వైద్య కళాశాలల్లోని ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్దేశిత రోజుల్లో పీహెచ్‌సీల ద్వారా సేవలందిస్తారు.
‘హెల్త్ మిషన్–100’ పేరిట ప్రత్యేక కార్యక్రమం
నాలుగు విడతల్లో వైద్య శిబిరాలు
శుక్రవారం ప్రారంభం.. జూన్ 27 వరకు కొనసాగింపు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు
వైద్య పరీక్షలు నిర్వహించే దశల తేదీలు..
మొదటి దశ శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు
రెండో దశ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు
మూడో దశ 16 ఏప్రిల్ నుంచి 15 మే వరకు
నాలుగో దశ 16 మే నుంచి 9 జూన్ వరకు


