అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతికి అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పీఠాధిపతులు అలంపూర్‌కు వచ్చారు. క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీజోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పీఠాధిపతులకు పాదుకా పూజలు నిర్వహించారు. అనంతరం శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి ఆలయ ప్రాంగణంలోని కుంకుమార్చన మండపంలో చంద్రమౌలీశ్వర ఆరాధన, శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.


