సంబరాల పండగొచ్చే..
పిండి వంటల ఘుమఘుమలు.. భోగిమంటల కాంతులు.. ముంగిళ్లలో ముచ్చటైన రంగవల్లులు.. పతంగుల కోలాహలం.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. వెరసి మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగభాగ్యాల భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమను కుటుంబంతో కలిసి నిర్వహించుకునేందుకు గాను ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. పల్లె, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.
– నారాయణపేట/నారాయణపేట రూరల్
ఆనందంగా నిర్వహించుకోవాలి..
జిల్లా ప్రజలకు ఎస్పీ డా.వినీత్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి అని.. ఈ పండగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు స్వీయ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా పండగ నిర్వహించుకోవాలని తెలిపారు. ముగ్గులు వేసే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని.. అపరిచితులు అడ్రస్ అడుగుతూ, మాట కలిపి ఏమార్చి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దొంగలించే అవకాశం ఉందన్నారు. అనుమానితులు కనిపిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
జీవితంలో కొత్తదనాన్ని స్వాగతిస్తూ.. పాత వస్తువుల్ని మంటల్లో వేయడంతో భోగి పండుగ ప్రారంభమవుతుంది. మూడు రోజుల పండుగలో ఇది మొదటిది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. చిన్నారులను సాక్ష్యాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి.. తలపై రేగిపండ్లు, పూలు, అక్షింతలు, చిల్లర నాణాలు పోసి, హారతి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందని, ఆయు వృద్ధి కలుగుతుందని నమ్మకం. భోగి మంటలతో వచ్చిన బూడిదను పిల్లలు, పెద్దలు నుదుటన ధరిస్తారు. కాగా, కొన్ని గ్రామాల్లో మంగళవారమే భోగి వేడుకలు జరుపుకొన్నారు. తెల్లవారుజామునే ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో తీర్చిదిద్దారు. దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
నువ్వుల రొట్టెలు ప్రత్యేకం..
భోగి రోజు అందరి ఇళ్లల్లోనూ నువ్వుల రొట్టెలు చేయడం ప్రత్యేకత. కొందరు బియ్యంపండి, మరికొందరు జొన్నపిండిలో నువ్వులను వేసి రొట్టెలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చలికాలం కావడం వల్ల నువ్వులు వంటికి వేడిని అందిస్తాయని భోగి రోజున వాటిని ఆరగిస్తారు. అలాగే చిక్కుకాయ లేదా వివిధ రకాల కూరగాయలను కలిపి వండుతారు.
సిరిసంపదలు కలగాలని..
రైతులు ఆరుగాలం శ్రమించగా చేతికి వచ్చిన పంటలతో సంతోషంగా నిర్వహించుకునే పండగ సంక్రాంతి. రెండవ రోజు సంక్రాంతి పర్వదినాన పాలు పొంగించి పొంగళి అనే తీపిపదార్థం తయారు చేస్తారు. వచ్చే ఏడాది పాటు తమ ఇళ్లల్లో సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ ఇళ్లల్లో పాలు పొంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటిముందు రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. లోగిళ్లన్నీ ఇంద్రధనుస్సు తలపిస్తూ కొత్త కాంతిని ప్రసరింపజేస్తాయి. మూడో రోజు కనుమ పండగ సందర్భంగా పశువులను అలంకరించి, వాటికి పూజలు చేసి విందు, వినోదాలతో గడుపుతారు.
జిల్లాలో మొదలైనసంక్రాంతి సందడి
నేడు భోగభాగ్యాల భోగి
పల్లెల్లో ఉట్టిపడుతున్న పండగ శోభ
సంబరాల పండగొచ్చే..


