వీబీ–జీ రామ్‌జీ చట్టంపై తప్పుడు ప్రచారం
● కేంద్రం నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవడం సరికాదు
● ఎంపీ డీకే అరుణ
పాలమూరు: వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్‌జీ)చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ గ్రామం కావాలని జీ రామ్‌జీ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద రూ.2 లక్షల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం రూ.8.53 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో ఈ పథకం అధికార పార్టీల నేతల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడిందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామ సభలలో అభివృద్ధి పనులను తీర్మానం చేసి ప్రణాళిక రూపొందించాలని దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు.. ఈనిధులు ఎక్కడివో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీబీ–జీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి తగ్గడం లేదని రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అదనంగా కేటాయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లకు పైగా నిధులు వచ్చాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, వీర బ్రహ్మచారి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.


