అన్ని బల్దియాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నారాయణపేట: ప్రతి గ్రామం, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మరోసారి నియామకం కాగా.. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ యువత ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారన్నారు. ఇందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే నిదర్శనమన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. పాత, కొత్త కాంగ్రెస్ అంటూ ఏమీ ఉండదని.. అందరూ సమానమేనని అన్నారు. మరో 15ఏళ్లు అధికారంలో ఉండే విధంగా పార్టీని పటిష్టం చేస్తామన్నారు. తన తండ్రి దివంగత వీరారెడ్డి బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
● డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి వార్డుకు రూ. కోటి చొప్పున రూ. 24కోట్లు తీసుకొస్తానని.. లేనిపక్షంలో మరోసారి ఓట్లు అడగనని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మున్సిపాలిటీని హస్తగతం చేసుకొని సీఎంకు కానుకగా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ నూమాన్, టీపీసీసీ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, చరణ్ జోషి, నంగి దేవేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, రాజీవ్‌రెడ్డి, మార్కెట్ కమిటీల చైర్మన్లు శివారెడ్డి, బెక్కరి అనిత, యువజన నాయకులు శివాంత్‌రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, జహీర్ అక్తర్, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతకుమార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పోష్ రాజేశ్‌కుమార్ పాల్గొన్నారు.


