‘డయల్‌ యువర్‌ ఎస్పీ’కి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’కి విశేష స్పందన

Mar 13 2026 8:56 AM | Updated on Mar 13 2026 8:56 AM

నారాయణపేట: జిల్లా ప్రజలకు పోలీస్‌శాఖ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల బాధితులు, ఫిర్యాదుదారులు ఫోన్‌చేసి తమ సమస్యలను వివరించారు. మొత్తం 21 మంది ఫోన్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు నేరుగా సంప్రదించి సమస్యలు తెలియజేసే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో దొంగతనాల నివారణకు రాత్రిళ్లు గస్తీ పెంచాలని, భూ తగాదాల ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. గతంలో జరిగిన దొంగతనాల కేసుల్లో నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని కొందరు ఫిర్యాదు చేశారు. అలాగే కోస్గిలో సంత రోజుల్లో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోందని, పోయిన సెల్‌ఫోన్లు ఇప్పటివరకు ట్రేస్‌ కాలేదని, ఠాణాల్లో ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని పలువురు వివరించారు. సమస్యలను ఎస్పీ స్వయంగా రాసుకొని సంబంధిత పోలీస్‌ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని, వారికి న్యాయం చేయడం ప్రధాన బాధ్యతని, నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావడమే పోలీస్‌శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement