ప్రజాప్రతినిధులను
గౌరవించండి..
నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రూ.5 వేల కోట్లతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చి భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌లు, కౌన్సిలర్ల ఒకరోజు శిక్షణకు మంత్రి హాజరై దిశా నిర్దేశం చేశారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనకు మనందరం కృషి చేద్దామన్నారు. సర్పంచ్, చైర్‌పర్సన్ పదవి అంటే ఆషామాషీ కాదని.. జనన, మరణ ధ్రువీకరణ పత్రం అందజేసే సర్పంచ్, చైర్మన్ పదవులు ఎంతో కీలకమన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవచేసే అవకాశం దొరకడం అదృష్టమని.. తాను సర్పంచ్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసి పదితరాల వరకు గుర్తుండేలా పని చేయాలని సూచించారు. 99 రోజుల కార్యక్రమంలో పది అంశాలను చేర్చారని.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. ఈ ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ గడ్డ అంతా అభివృద్ధి జరుగుతుందన్నారు. వరికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్‌బంకుల నిర్వహణ, ఆర్టీసీలో అద్దె బస్సుల నిర్వహణతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు. స్టేడియం నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామన్నారు.
సర్పంచ్, చైర్‌పర్సన్ పదవి
ఎంతో కీలకం
రూ.5 వేల కోట్లతో
పేట–కొడంగల్ పనులు
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులందరికి మంత్రిగా సూచన చేస్తున్నానని.. ప్రజాప్రతినిధులను గౌరవించడం మనందరి బాధ్యతని మంత్రి అన్నారు. ముఖాలు, పార్టీలు చూసి పని చేయొద్దని, ప్రజాప్రతినిధులందరూ ఒక్కటేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో 272 మంది సర్పంచులు, 72 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్పీ వినీత్, మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


