ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్‌శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి సీఎస్ రామకృష్ణారావు జిల్లా ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఫొటో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం తుది ఓటరు జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని.. 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నోడల్, జోనల్, సెక్టోరియల్ అధికారుల నియామకం, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేలైన్స్ బృందాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. అదే విధంగా నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించి అర్జీలు సమర్పించారు.


