ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
కృష్ణా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పథకం కూలీలతో క్షీరాలింగేశ్వర మఠంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు రాజమల్లేష్ సిద్ధార్థతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం పేదలకు వేసవిలో 100 రోజులు ఖచ్చితమైన పని కల్పించి వారికి కూలి చెల్లించేవారని, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ఉపాధిహామీ పథకాన్ని నీరుగారుస్తూ గ్రామాల్లో పనులు లేకుండా చేస్తుందని అన్నారు. అలాగే పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పనులు కూడా కల్పించడంలేదని, ఇదివరకు చేసిన పనులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. గతంలో ఈ పథకానికి కేంద్రం 90 శాతం నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం నుంచి జీఎస్‌టీ రూపంలో నిధులు తీసుకెళ్తుంది కాని మనకు రావాల్సిన వాటా మాత్రం ఇవ్వకుండా వేధిస్తుందని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి,సర్పంచ్ నాగేష్,నాయకులు రవిగౌడ,సబ్జీర్ ఆలీ,సర్ఫరాజ్,బీమ్సీ, నారాయణ,బాబు,తిమ్మప్ప,బొల్ల మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్ నీటిని
సద్వినియోగం చేసుకోండి
దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి పంటలకు నీటిని వదిలిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు వేసుకునే అనువైన సమయంలోనే నీటిని వదులుతున్నామన్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని యాసంగి పంటలకు అందించాలని ఇటీవల జిల్లాస్థాయిలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు నీటి వృథాను అరికట్టి కిందిస్థాయిలో ఉండే రైతులకు నీటిని వదలాలని సూచించారు. అయిదు విడతలుగా నీటిని వదలడం జరుగుతుందని, ప్రతి విడత పది రోజులు ఉండేలా ప్రణాళికలు చేశారన్నారు. రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తుచేశారు. పాలమూరు– రంగారెడ్డి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపకల్పన చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2013లో జూరాల సోర్స్‌గా పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర


