పోలీసుశాఖపై నమ్మకం పెంచాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీసుశాఖపై నమ్మకం పెంచాలి : ఎస్పీ

Mar 12 2026 8:52 AM | Updated on Mar 12 2026 8:52 AM

నారాయణపేటరూరల్‌: పోలీసుశాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఎస్పీ డా. వినీత్‌ కోరారు. జిల్లాకేంద్రం సమీపంలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసులను పరిశీలించి జాప్యానికి గల కారణాలను ఎస్‌ఐ రాముడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యం, విధుల్లో అలసత్వం సరికాదని హెచ్చరించారు. ఠాణా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రిసెప్షన్‌, స్టేషన్‌ రికార్డులు తదితర వాటిని భద్రపర్చాలని సూచించారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ అక్రమ సరుకు రవాణాపై దృష్టి సారించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్పీ

నారాయణపేట: ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడంలో భాగంగా గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఎస్పీ కార్యాలయ ఫోన్‌నంబర్‌ 0850–6281182 సంప్రదించాలని.. ఎస్పీ డా. వినీత్‌ స్వయంగా మాట్లాడి సమాధానమిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ

నారాయణపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, పుర కౌన్సిలర్లకు గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఫణిందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్‌హాల్‌లో కార్యక్రమం కొనసాగుతుందని.. ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు జరిగే శిక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు, 99 రోజుల పాటు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించే వివిధ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, నిష్ణాతులైన శిక్షకులతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

‘ఇరాన్‌పై దాడులు ఆపాలి’

నారాయణపేట ఎడ్యుకేషన్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ జరిపే దాడులు వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్‌ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సావర్కర్‌ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రపంచ దేశాలపై అడ్డుగోలుగా దాడులు చేసి ఆయా దేశాల నాయకులు, ప్రజలను చంపి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు వ్యతిరేకంగా గళమెత్తిన ఇరాన్‌ అధ్యక్షుడిని దారుణంగా హత్య చేసిందని.. అదేవిధంగా అణు కార్మాగాలను ధ్వంసం చేసి వేలమంది చావుకు కారణమైందన్నారు. యుద్ధ ప్రభావంతో దేశంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.60 పెరిగిందని.. రాబోవు రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరిగే ఆస్కారం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాల్‌, అంజిలయ్య, ఆంజనేయులు, గోవింద్‌, అలీ, నరహరి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మహిళా

సదస్సుకు నిడ్జింత సర్పంచ్‌

కొత్తపల్లి: అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కేంద్ర ప్రభుత్వం డిల్లీలో నిర్వహించిన జాతీయ మహిళా సదస్సుకు మండలంలోని నిడ్జింత సర్పంచ్‌ రజిత హాజరయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మంది మహిళా సర్పంచులను ఎంపిక చేయగా జిల్లా నుంచి కొత్తపల్లి మండలం నిడ్జింత సర్పంచ్‌ ఎంపికయ్యారు. బీఎస్సీ బీఈడీ పూర్తిచేసిన రజిత రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు పాల్గొనే సభకు వెళ్లడంతో మండల, జిల్లాస్థాయి నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement