చకచకా.. సుందరీకరణ | - | Sakshi
Sakshi News home page

చకచకా.. సుందరీకరణ

Mar 12 2026 8:52 AM | Updated on Mar 12 2026 8:52 AM

ఉమ్మడి జిల్లాలో నాలుగు స్టేషన్లు..

ఆకర్షణీయంగా.. ఆహ్లాదకరంగా

5జీ సేవలకు టవర్లు

ఊపందుకున్న అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం పునరాభివృద్ధి పనులు

విమానాశ్రయాల స్థాయిలో

వసతుల కల్పనకు చర్యలు

ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు

ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్‌ మేనేజర్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం’ (ఏబీఎస్‌ఎస్‌) కింద రైల్వేస్టేషన్‌లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి.

రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్‌పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్‌కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్‌కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్‌కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్‌సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్‌, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్‌ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్‌, రైల్వే బుకింగ్‌ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్‌ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్‌ ప్రాంతం, అప్‌గ్రేడ్‌ చేసిన పార్కింగ్‌ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు.

ట్రాఫిక్‌ సర్క్యులేషన్‌, ఇంటర్‌ మోడల్‌ ఇంటిగ్రేషన్‌ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్‌, ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రాక్‌ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశం వద్ద ర్యాంపులు, కేఫ్‌ ఏరియా, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆధునిక లైటింగ్‌తో సహా స్పీడ్‌వైఫే 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement