యువతకు కిడ్నీ గండం | - | Sakshi
Sakshi News home page

యువతకు కిడ్నీ గండం

Mar 12 2026 8:52 AM | Updated on Mar 12 2026 8:52 AM

పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్‌లెట్స్‌ వాడటం, షుగర్‌, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.

479 మందికి డయాలసిస్‌

ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యల తో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్‌ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితు లు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్‌ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్‌లో ఐదు, మక్తల్‌లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.

మార్చి రెండో గురువారం..

ఏటా మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్‌ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి.

దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్‌, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్‌ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది.

రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్‌ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కో సారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్‌ ఇంజెక్షన్‌ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు.

కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ.

మూత్రపిండం.. జరభద్రం

మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు

మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు

నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement