జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు.. 8,316 మంది విద్యార్థులు
● కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన
● సీసీ కెమెరాల పర్యవేక్షణ
● ‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి గోవిందరాజు
నారాయణపేట రూరల్: జిల్లాలో శనివారం నుంచి జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కొంత మార్పులు జరిగాయి. ఓఎంఆర్ షీట్‌తో పాటు సమాధాన పత్రానికి బదులు 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, మౌలిక సౌకర్యాలు, ప్రశ్నపత్రాలు చేర్చడం తదితర వివరాలను బుధవారం జిల్లా విద్యాధికారి గోవిందరాజు ‘సాక్షి’కి వివరించారు.
● ప్రశ్న: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
● డీఈఓ: పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా, సిట్టింగ్‌స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. వీరు పరీక్ష ప్రారంభం నుంచి చివరి వరకు కేంద్రంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి కేంద్రానికి తగిన పోలీసు బందోబస్తు కల్పిస్తున్నాం.
● ప్రశ్న: సిబ్బందికి ఏమైన శిక్షణ ఇచ్చారా?
● డీఈఓ: చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను సెంటర్ల వారీగా నియమించి ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. ప్రత్యేక్ష శిక్షణతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాం. నిబంధనలకు సంబంధించిన బుక్‌లెట్ పంపిణీ చేశాం. ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయింది. గురువారం వారికి తగిన సూచనలిస్తున్నాం.
● ప్రశ్న: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?
● డీఈఓ: అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల్లో వెలుతురు, గాలి వచ్చేలా ఏర్పాట్లు చేశాం. మూత్రశాలలు, మరుగు దొడ్లు, తాగునీరు, విద్యుత్ స రఫరా, ఫ్యాన్లు ఉంటేలా మా ర్పులు చేశాం. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. పోలీసుల సహకారంతో కేంద్రాల ఆవరణలో 144సెక్షన్ అమలులో ఉంటుంది.విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయిస్తున్నాం.
● ప్రశ్న: కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా?
● డీఈఓ: విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు, సలహాలు తెలియచేయాలనుకుంటే సెల్‌నంబర్ 86397 15158 సంప్రదించాలి.
● ప్రశ్న: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
● డీఈఓ: నేరుగా పరీక్షలంటే భయం వీడి పండుగలా భావించాలి. ఇప్పటి వరకు చదివిన అంశాలను నివృత్తి చేసుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని ముందురోజు చూసుకోవడంతో ఆందోళన ఉండదు. పరీక్షకు వచ్చే ముందు అల్పాహారం తిని రావాలి. గంటముందే కేంద్రానికి చేరుకొని హాల్‌టికెట్‌తో లోపలికి వెళ్లాలి. అన్నిరకాలైన రాత వస్తువులు వెంట తెచ్చుకోవాలి. ప్యాడ్‌పై ఎలాంటి రాతలు, కాగితాలు ఉండరాదు. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రాకూడదు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.
ప్రశ్న: ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎంత మంది సిబ్బందిని నియమించారు?
డీఈఓ: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాలతో కలిపి మొత్తం 43 ఏర్పాటు చేశాం. వాటిలో స్థానిక మాడ్రన్ స్కూల్‌లో ప్రైవేట్ విద్యార్థులను విలీనం చేశాం. 43 మంది సీఎస్‌లు, 43 మంది డీఓలు, 43 సీసీలు, 380 మంది ఇన్విజిలేటర్లతో పాటు స్కాడ్ డ్యూటీకి విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం.
ప్రశ్న: జిల్లాలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయి? ఎందరు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు?
డీఈఓ: జిల్లావ్యాప్తంగా అన్నిరకాల యాజమాన్య పాఠశాలలు 146 ఉండగా.. 8,316 మంది విద్యార్థులు చదువుకున్నారు. వీరికితోడు 29 మంది సప్లిమెంటరీ విద్యార్థులతో కలిపి 8,347 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,977 మంది బాలురు, 4,370 మంది బాలికలు ఉన్నారు.
ప్రశ్న: పరీక్ష సమయం ఎలా ఉంటుంది? నిబంధనలు ఏమిటి?
డీఈఓ: గతంలో 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడింటికి కుదించారు. ఈ ఏడాది మాత్రం వరుసగా కాకుండా పరీక్షల మధ్య నాలుగు రోజుల వ్యత్యాసంతో టైంటేబుల్ కేటాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుంది. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 20 నిమిషాలు అదనంగా ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పరీక్ష గంటన్నర మాత్రమే ఉంటుంది. కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందే అనుమతిస్తాం. పరీక్షకు ముందే విద్యార్థుల సమాచారం ఇన్విజిలేటర్లు నమోదు చేసుకుంటారు.
ప్రశ్న: హాల్‌టికెట్ల ఇబ్బందులు ఎలా అధిగమించాలి?
డీఈఓ: హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేరుగా అందిస్తారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో ఆపినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సైతం ‘బీఎస్‌ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హెచ్‌ఎం సంతకం లేకుండా నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు.


