సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డీఈఓ గోవిందరాజు అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో సమర్థవంతమైన బోధన చేసినప్పుడే విద్యార్థుల్లో నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుందన్నారు. సైన్స్ అంటేనే నిత్య ప్రయత్నం అని, ఓటమికి కుంగిపోకుండా, గెలుపునకు పొంగిపోకుండా రెండింటిని సమానంగా ఆస్వాదించాలన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్నారు. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ లోనూ ప్రతిభ చాటాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయుల చక్కటి బోధనతోనే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కాగలరని అన్నారు. సైన్స్ ఫెయిర్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ ముఖ్యం అని, సైన్స్ లేనిదే జీవితం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ భాను ప్రకాష్, సూపరింటెండెంట్ నరసింహ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, రాజేంద్రకుమార్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, ట్రాస్మా రాష్ట్ర కార్యదర్శి రాజేష్ కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, నరసింహ, రెడ్డప్ప, హైమావతి, యశ్వంత్, షేర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఏడు అంశాలకు సంబంధించి సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించారు. అదేవిధంగా ఇన్ స్పైర్ పోటీల్లో అరుణ్ (జడ్పీ స్కూల్ గోటుర్), అనిత (జడ్పీ స్కూల్ ముశ్రిఫా) రాష్ట్రస్థాయికి ఎన్నికయ్యారు. ఇక సెమినార్ నిర్వహణలో ప్రవీణ్ (గిరిజన పాఠశాల, కొండాపూర్) విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.


