‘పేట’ చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
నారాయణపేట: నారాయణపేట చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, మరింత నైపుణ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ చీరలను నేసి వ్యాపారం పెంచుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో నారాయణపేట చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకంలో భాగంగా 72 మంది చేనేత కార్మికులకు మగ్గలు, చేనేత అధునాతన యంత్రాలు, పరికరాలు జక్కడ్స్, ఫ్రేమ్ లూన్, వైడింగ్ మిషన్, ఫిర్కం డబ్బా,ఫిట్‌లను శనివారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నారాయణపేటలో నేసిన చేనేత చీరలకు మహారాష్ట్రలో డిమాండ్ ఎక్కువగా ఉందని, ఎక్కువ ఆదాయం పెంచుకోవాలన్నారు. తొందరగా స్కీమ్ అమలు చేస్తే.. మరో విడత తొందరగా మంజూరు అవుతుందని, లబ్ధిదారులు 10 శాతం వాటా చెల్లిస్తే.. మిగతా 90శాతం వాటా కేంద్రం అందిస్తుందని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు, చేనేత కార్మికులకు చేనేత పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వర్క్ షెడ్లు వస్తాయని, వర్క్ షెడ్ అనేది హౌసింగ్ స్కీమ్‌లో భాగమన్నారు. ఎంతమందికి వర్క్ షెడ్లు అవసరమో అధికారులు గుర్తించి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు పని ఒత్తిడి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. యంత్రాల ఉపయోగంతో శారీరక శ్రమ తగ్గుతుందనీ చెప్పారు. నారాయణపేట చీరలకు మంచి డిజైన్ జోడిస్తే.. మరింత డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, అధికారి విజయ్ కుమార్, పగుడాకుల శ్రీనివాసులు, ఆంజనేయులు, బత్తుల సతీష్, క్లశ్రీనివాస్, నవిలే విజయ్ కుమార్ ల్గొన్నారు.


