తగ్గిన నేరాలు!
నారాయణపేట: గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ వార్షిక క్రైం రిపోర్టును విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 2024–25కు గాను రిపోర్టెడ్ కేసులు 10.5 శాతం పెరిగాయి. తీవ్రమైన నేరాలు 22 శాతం తగ్గగా.. కిడ్నాప్ కేసులు 4 శాతం పెరిగాయి. మహిళలపై జరిగే నేరాలు 12.5 శాతం, క్రైం అగనెస్ట్ ఉమెన్ 4శాతం, బాల్యవివాహాలు 40 శాతం తగ్గాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంసీసీ వైలెన్స్ 12, పోల్ వైలెన్స్ 3, లిక్కర్ కేసులు 63, ఇతర కేసులు 2 నమోదయ్యాయి. సైబర్ నేరాలకు సంబంధించి 368 ఫిర్యాదులు అందగా.. 165 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో రూ. 43,74,618 గాను కోర్టు ఆదేశాల మేరకు రూ. 20.40 లక్షలు రికవరీ చేశారు. డయల్ 100కు 11,124 మంది సంప్రదించగా.. బ్లూ కోట్స్ పోలీసులు సత్వర సేవలు అందించారు. సీఈఐఆర్ ద్వారా రూ. 35.34లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. గంజాయికి సంబంధించి 20 మందిపై కేసులు నమోదు చేసి.. 12.675 కిలోలు సీజ్ చేశారు. అక్రమ మద్యం కేసులు 147 నమోదు కాగా.. 1526.57 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 36 గేమింగ్, జూదం యాక్ట్‌లో 221 మందిపై కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన ఐదుగురిపై కేసులు నమోదు చేసి.. 300 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 58 మందిపై కేసులు చేసి.. 612 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 313 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 169 ట్రాక్టర్లు, 73 టిప్పర్లు, 2 జేసీబీలు, 1 బొలేరో వాహనాలను సీజ్ చేశారు.
పోలీసు సేవలకు పతకాలు..
ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను ఎస్పీ వినీత్ కొత్తగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ప్రజలు 08506–281182 నంబర్‌ను సంప్రదించి సమస్యలను తెలియజేస్తున్నారు. జిల్లా పోలీసు సేవలను సంబంధితశాఖ గుర్తించి గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలను ప్రదానం చేసింది. సరికొత్త విధానాలతో ప్రజలకు పోలీసుశాఖ మరింత చేరువైందని ఎస్పీ వినీత్ చెప్పారు. 2026 నూతన సంవత్సరంలో డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తగ్గిన నేరాలు!


