‘వైకుంఠ’ శోభితం
నారాయణపేట ఎడ్యుకేషన్/మక్తల్: జిల్లావ్యాప్తంగా మంగళవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఉత్తరద్వార దర్శనాలు కల్పించగా.. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని తన్మయం చెందారు. జిల్లా కేంద్రంలోని పళ్లవీధిలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంతో పాటు సరాఫ్ బజార్ బాలాజీ మందిరం, సత్యనారాయణస్వామి ఆలయం, అశోక్‌నగర్ శ్రీమాత మల్లాంభిక ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో మహా అభిషేకం, పుష్పాలంకరణ, తులసి అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మక్తల్ పట్టణంలోని నాగిరేశ్వరాలయంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీపడమటి ఆంజనేయస్వామి, మల్లికార్జునస్వామి, కుంభేశ్వరుడు, నల్లజానమ్మ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి.
‘వైకుంఠ’ శోభితం


