
యూరియా సరఫరా పకడ్బందీగా చేపట్టాలి
నర్వ: యూరియా సరఫరా పకడ్బందీగా చేపట్టాలని, ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శనివారం నర్వ పీఏసీఎస్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఈఓ ఉదయ్‌ను ఇప్పటి వరకు పంపిణీ చేసిన వివరాలు, స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేసిన యూరియా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులున్నాయని స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీని ఎప్పటికప్పుడు పరిశీలించి ఇబ్బదులు తలెత్తకుండా చూడాలని, యూరియా అక్రమంగా తరలిస్తే కఠినంగా చర్యలుంటాయన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మల్లారెడ్డి, ఏఓ అఖిలారెడ్డి తదితరులున్నారు.