
పడమటి అంజన్న కోనేరుకి పూర్వవైభవం
మక్తల్: దాదాపు 50 ఏళ్లుగా పట్టించుకునే వారు లేక శిథిలావస్థకు చేరి.. చుట్టుపక్కల ఇళ్ల వారు వేసే చెత్తా చెదారంతో నిండి కళతప్పిన పడమటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు పూర్వవైభవం రానుంది. ఒకప్పుడు ఇదే కోనేరు నీటితో స్వామివారికి ప్రత్యేక పూజలు, పుష్కర స్నానాలు గావించేవారు. రానురాను కోనేరు శిథిలావస్థకు చేరుకోవడం, నీరు సైతం అడుగంటిపోవడంతో కళ తప్పింది. ఈనేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఉత్సవాలకు కోనేరును సిద్ధం చేయాలని, భక్తులు ఇక్కడే స్నానం చేసి పడమటి అంజన్నను దర్శనం చేసుకోవాలని రాష్ట్రమంత్రి వాకిటి శ్రీహరి నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం (నేడు) సుందరీకరణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఏళ్లుగా ఆదరణ లేక.. శిథిలావస్థకు చేరిన కోనేరుకు పూర్వవైభవం రానుండడం, అభివృద్ధి పనులు చేపట్టడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.