
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నారాయణపేట: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని జూనియర్, సినియర్ సివిల్ జడ్జిలు, పోలీసు అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు. శనివారం నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసు కుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందన్నారు. తమ కేసులను రాజ మార్గం ద్వారా పరిష్కారం చేసుకోవాలి కక్షిదారులకు సూచించారు. పరిష్కారం కోసం యాక్సిడెంట్, కొట్టుకున్న కేసులు,చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న దొంగతనాలు, కరోనా సమయంలోని పెండింగ్ లో ఉన్న కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి బి మనోజ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప, డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహారంఅందించాలి
నారాయణపేట: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా మైనార్టీ అధికారి ఎంఏ రషీద్, విజిలెన్స్ అధికారులు జమీర్‌ఖాన్, ఎంఏ మసూద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్ రూంలోని ఆహార పదార్థాలు, స్టాక్ రిజిస్టర్లు, విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లతోపాటు గదులు, పరిసరాలను పరిశీలించారు. ఆహారం ఎలా ఉంటుందని, సమస్యలు ఎదుర్కొంటున్నారా అని విద్యార్థులతో ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో పాటు అల్పాహారాన్ని భుజించారు.
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
నారాయణపేట క్రైం: వినాయక చవితి నేపథ్యంలో ఆయా మండపాల్లో ఏర్పాటుచేసే విగ్రహాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ యోగేష్‌గౌతమ్ తెలిపారు. జిల్లా పరిధిలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని, విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలని తెలిపారు. విగ్రహాల ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు.

పెండింగ్ కేసులను పరిష్కరించాలి