
న్యాయం జరిగే వరకు ఉద్యమం
నారాయణపేట: నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ అన్నారు. శనివారం మున్సిపల్ పార్క్ దగ్గర భూనిర్వాసితుల సంఘం అధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన హామీతో ముందుకు రావడంలేదని, మాకు సరైన న్యాయం చేసి సత్వరమే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు. ప్రజా పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటి పాలనలోనే మా ప్రాంత రైతుకు నీళ్లు అందివ్వాలని, సరైన పరిహారంతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు, భూ నిర్వాసితుల కుటుంబాల పిల్లలకు గురుకుల, సైనిక, మోడ్రాన్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో అడ్మిషన్లు ఇవ్వాలని, భూ నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో ధర్మరాజు గౌడ్, అనంతరెడ్డి కనకదాసు, శ్రీశైలం, డొల్ల కిష్టప్ప, పద్మ, పిల్లి గుండ్ల బాలప్ప, సింగారం హనుమంతు, పిండికూర అంజప్ప, భగవంతు తదితరులు పాల్గొన్నారు.