
పోరాట యోధుడు సురవరం
చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూత
రాజకీయాల్లో చెరగని ముద్ర..
● దేశ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించిన నేత
● మూడుసార్లు సీపీఐ జాతీయ
కార్యదర్శిగా ఎన్నిక
● నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా సేవలు
● స్వగ్రామం కంచుపాడులో
విషాదఛాయలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ అలంపూర్: విద్యార్థి నేతగా.. పోరాట యోధుడిగా.. జాతీయ స్థాయిలో రాణించిన సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారన్న సమాచారంతో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడులో తీవ్ర విషాదం అలుముకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈయన సీపీఐలో మూడు సార్లు పార్టీ ఉన్నత పదవి జాతీయ కార్యదర్శి హోదాను దక్కించుకున్నారు. మారుమూల గ్రామంలో పుట్టిన సురవరం సుధాకర్‌రెడ్డి సీపీఐ అత్యున్నత పదవిని దక్కించుకొని రాష్ట్రానికి, గ్రామానికి వన్నె తెచ్చారు.
విదార్థి దశ నుంచే..
సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించారు. పోరాట పటిమగల కుటుంబంలో జన్మించిన సుధాకర్‌రెడ్డి సైతం విద్యార్థి దశ నుంచే పలు ఉద్యమాలు చేపట్టి రాజకీయాల్లో రాణించారు. ఉస్మానియా కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థి సమస్యలపై పోరాడుతూ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎదిగారు. విద్యాభ్యాసం కొనసాగుతున్న సమయంలో విద్యార్థి కమ్యూనిస్టు విభాగంలో పనిచేస్తున్న సుబ్బన్న, రాజన్నల ప్రోద్బలంతో పనిచేశారు. అనంతరం నీలం రాజశేఖర్‌రెడ్డి సహాయ, సహకారాలతో రాజకీయాల్లో రాణించారు. బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు.
● సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శిగా 2012, 2015, 2017లో మూడుసార్లు జాతీయ పదవిని దక్కించుకోని పార్టీకి, ప్రజలకు సేవలందించారు. జాతీయ స్థాయి పదవిని మూడుసార్లు దక్కించుకొని రాష్ట్రానికి, సొంత గ్రామానికి వన్నె తెచ్చారు.
● అప్పటికే కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్న అనుబంధం కారణంగా 19 ఏళ్లకే ఏఐఎస్‌ఎఫ్ కర్నూలు టౌన్ కార్యదర్శిగా, 1960 జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. ప్రతి విద్యార్థికి చదువు, పోరాటం రెండు కళ్లు అని చెప్పే సురవరం జీవితంలో రెండు మరిచిపోని సంఘటనలున్నాయి. ఒకటి బ్లాక్ బోర్డుల ఉద్యమమైతే.. మరొకటి 1962లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన 62 రోజుల నిరవధిక సమ్మె ఆయన నాయకత్వంలోనే జరిగింది. ఆ తర్వాత ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, మరుసటి ఏడాది జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవిని రెండుసార్లు నిర్వహించిన సురవరం ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ పలు అంతర్జాతీయ సదస్సులకు ప్రాతినిధ్యం వహించారు. ఈ కాలంలో జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేశారు. కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ జాతీయ మహాసభలో జాతీయ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన సురవరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో క్రియాశీలకమయ్యారు.
స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు..
సురవరం సుధాకర్‌రెడ్డి జాతీయ స్థాయికి ఎదిగినా స్వగ్రామంపై ఉన్న మమకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ యువత కోసం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామీణ యువతీ, యువకులకు ఉచిత కంప్యూటర్, కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను అందించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు, వృత్తి విద్య కోర్సులు ఏర్పాటు చేసి యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి కృషి చేశారు. యువతకు ఉపాధితో పాటు క్రీడలను ప్రోత్సహించారు.
సురవరం సుధాకర్‌రెడ్డి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్‌లోని ఆయన తల్లి తరపు బంధువులు కమ్యూనిస్టు భావాలను స్వాగతించడంతో 1985, 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. రెండు ఎన్నికల్లోనూ ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి 1994లో పోటీ చేశారు. ఇక్కడ కూడా ఆయనకు విజయం దక్కలేదు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ రాజధానికి మకాం మార్చిన ఆయన నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి 1998, 2004లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ, స్థానికంగా పోటీకి మాత్రం దూరంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో రాణించారు. పార్టీ అత్యున్నత స్థానంగా భావించే జాతీయ కార్యదర్శి హోదా దక్కించుకున్నారు. 2012లో ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శిగా తొలిసారి ఎన్నికయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు.