
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట
నారాయణపేట/ధన్వాడ/ఊట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఇందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా పనుల జాతర–2025 చేపట్టినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ధన్వాడ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా రూ.12 లక్షలు కేటాయించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పని కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో అవసరమైన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామాలలో మౌళికవసతుల కల్పన వంటి ముఖ్యమైన అభివృద్ధిపనులు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటి చైర్మన్ సదాశివరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, డీఆర్‌డీఓ మోగులప్ప, తహసీల్దార్ సింధూజ, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, నరహరి పాల్గొన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం
అందించాలి
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం ఊట్కూరు మండలంలోని పెద్దజట్రం ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల పక్కనే రేకుల షెడ్‌లో భోజనాన్ని వండుతుండడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మంది విద్యార్థులకు ఇంతచిన్న రేకుల షెడ్‌లో వంట వండడం ఏమిటని, వెంటనే వంటగదితోపాటు పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మద్యహ్నా బోజనం అందించడం లేదని తెలుసుకున్న కలెక్టర్ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుచీ శుభ్రతతో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు అందించాలన్నారు. పాఠశాల ముందు ఖాలీ స్థలం రేకుల షెడ్ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందిందని వివాదంలో ఉందని హెచ్‌ఎం కల్టెర్ దృష్టికి తీసుకురాగా స్థలం సర్వే నెంబర్ వివరాలను వెంటనే ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వచ్చే నెల నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. హెచ్ ఎం గౌరమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు చేపట్టేందుకే ‘పనుల జాతర’
వివిధ రకాల అభివృద్ధి పనుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ సిక్తా పట్నా యక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ.12 లక్షలతో అంగన్ వాడీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం స్వచ్ఛ భారత్ మిషన్, పీ.ఆర్ కు సంబంధించిన రూ.17.51 కోట్లతో జిల్లాలో 2190 చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా లింగంపల్లి ప్రాథమిక పాఠశాల ఒకే ఒక్క ఉపాధ్యాయురాలితో కొనసాగుతోందని స్వయంగా సదరు ఉపాధ్యాయురాలే కలెక్టర్‌కు విన్నవించారు. డీఈఓతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు.