
కళాశాలల్లో వసతులేవి..?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదని మరోసారి తేటతెల్లమైంది. చాలా కళాశాలల్లో అర్హులైన సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో లేకపోవడం, ల్యాబ్స్, మరుగుదొడ్లు, విద్యార్థులు కళాశాలకు రావడం లేదని తదితర అంశాలపై విద్యార్థి సంఘాల నాయకులు వీసీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఇటీవల పలు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో 7 కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడం వంటివి గుర్తించి.. ఆయా కళాశాలలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అయితే నోటీసులకు అన్ని కళాశాలల నుంచి సమాధానం రావడంతో వాటిని పరిశీలించి తదుపరి చర్యలను తీసుకోనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో ఓ కళాశాలపై చర్యలు సైతం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. డిగ్రీతోపాటు ఇతర కళాశాలలపై నిర్వహించాల్సిన అప్లియేషన్, ర్యాటిఫికేషన్‌ను అధికారులు ఇప్పటి వరకు నిర్వహించకపోవడం గమనార్హం.
నామమాత్రంగా చేశారా..
పీయూ పరిధిలోని 29 బీఈడీ కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో అప్లియేషన్ కోసం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారులు సంబంధిత కళాశాలలో నిబంధనలు పాటించని వాటికి సిబ్బంది, వసతులు తదితర అంశాలను సమకూర్చుకోవాలని రిమార్క్ రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు రిమార్కు చూపించారా.. లేక నామమాత్రంగాతనిఖీలు చేశారా.. అనేది ప్రశ్నగా మిగిలింది. తాజాగా అప్లియేషన్ తనిఖీలు చేసిన కళాశాలల్లోనూ వసతులు లేవని విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేసే వరకు చర్యలు తీసుకోకుండాఅధికారులు ఏం చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు కళాశాలలను ఒక వీసీ నేరుగా వసతులపై తనిఖీలకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కిందిస్థాయి సిబ్బంది ప్రైవేటు కళాశాలల్లో పర్యవేక్షణను పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో వీసీ నేరుగా తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
7 కళాశాలలకు నోటీసులు
పీయూ వీసీ శ్రీనివాస్ మొత్తం 10 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇందులో 7కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో సెయింట్ మేరీస్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్ మదీనా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, నలంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆదర్శ కళాశాల ఎడ్యుకేషన్, శ్రీవాసవీ ప్రతాపరాజ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలమూరు కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో కొన్నింటిలో ర్యాటిఫికేషన్ సమయంలో చూపించిన అధ్యాపకులు తనిఖీల సమయంలో లేకపోవడం, ల్యాబ్స్, లైబ్రరీలు, ఇతర వసతులు లేకపోవడం, ఉన్న సిబ్బందిలో నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు లేకపోవడం వంటివి ఉన్నాయి. వీటితోపాటు ఎస్‌డీఎం కాలేజీ ఆఫ్ లా వనపర్తికి నోటీసులు ఇచ్చారు. ఈ కళాశాల ప్రారంభం నుంచి సిబ్బందికి సంబంధించి అసలు ర్యాటిఫికేషన్ చేయించుకోలేదని, అందుకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చిన కళాశాలల్లో సెయింట్ మేరీస్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కళాశాలలో బీఈడీలో ఇన్‌టెక్ 100 మంది కాగా ఇందులో 50 శాతం సీట్లకు కోత విధించారు. అంటే 50 సీట్లను తక్కువగా అడ్మిషన్ చేసుకోవాల్సి ఉంది. త్వరలో మరిన్ని కళాశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు
ఏడింటిలో పూర్తిస్థాయిలో వసతులు లేవని గుర్తించిన వీసీ
మరో 7 కళాశాలలకు షోకాజ్ నోటీసులు
గతంలో అప్లియేషన్‌తనిఖీలు నిర్వహించిన అధికారులపై విమర్శలు

కళాశాలల్లో వసతులేవి..?