వైఎస్సార్‌సీపీలో ఉంటే లేపేస్తాం
కోవెలకుంట్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఎలాగైనా సర్పంచ్, వార్డు స్థానాలను దక్కించుకోవాలని కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారు. సంజామల మండలం పేరుసోములలో సోమవారం రాత్రి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ కార్యకర్త కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పచ్చమూకలు దాడులకు తెగబడ్డారు. బాధితులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల కడియం కంబగిరి వైఎస్సార్‌సీపీలో క్రీయాశీలక కార్యకర్తగా కొనసాగుతున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఆయన మరదలు భాగ్యలక్ష్మి గ్రామంలోని 8వ వార్డు స్థానానికి నామినేషన్ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కంబగిరి కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. అతని తమ్ముడు రాముడు, తల్లి లక్ష్మిదేవిని నానా దుర్భాషలాడుతూ భయభాంత్రులకు గురి చేశారు. ‘వైఎస్సార్‌సీపీలో ఉంటే చంపుతాం’ అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ‘ఎంత ధైర్యం ఉంటే తమకు వ్యతిరేకంగా గ్రామంలోని వార్డు స్థానానికి నామినేషన్ వేస్తారా.. మీ కుటుంబాన్ని గ్రామంలో లేకుండా ఊరు విడిపిస్తాం.. మర్యాదగా నామినేషన్ ఉపసంహరించుకో’ అంటూ పచ్చమూకలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కంబగిరిపై విచక్షణా రహితంగా దాడి చేసి ముఖం, తలపై బలంగా కొట్టారు. రక్తగాయాలకు గురైన కంబగిరిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి కుటుంబానికి పరామర్శ..
పేరుసోములకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి విషయన్ని తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహహన్‌రెడ్డి, సంజామల మండల మాజీ జెడ్పీటీసీ చిన్నబాబు మంగళవారం ఉదయం హుటాహుటినా ఆసుపత్రికి చేరుకున్నారు. దాడిలో గాయపడిన కంబగిరిని పరామర్శించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులుగా ఉన్నామనే అక్కసుతో తన కుటుంబంపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడిచేశారని బాధితులు కాటసాని వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని గ్రామంలోకి రానివ్వబోమని హుకుం జారీ చేశారని వాపోయారు. టీడీపీ నాయకుల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు దాడిలో గాయపడిన కంబగిరి ఆరోగ్య పరిస్థితులను కాటసాని అక్కడి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కంబగిరి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.


