పోలీసు రాజకీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు రాజకీయం

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

● సర్పంచ్‌ ఎన్నికల్లో సోదరుడిని గెలిపించుకునేందుకు కానిస్టేబుల్‌ మద్దిలేటి కుట్రలు ● ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థి వర్గం సర్పంచ్‌ అభ్యర్థులపై అక్రమ కేసులు బనాయింపు

● సర్పంచ్‌ ఎన్నికల్లో సోదరుడిని గెలిపించుకునేందుకు కానిస్టేబుల్‌ మద్దిలేటి కుట్రలు ● ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థి వర్గం సర్పంచ్‌ అభ్యర్థులపై అక్రమ కేసులు బనాయింపు

డోన్‌: సర్పంచ్‌ ఎన్నికల వేళ ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగ బాధ్యతలను పక్కనపెట్టి పక్తు రాజకీయ నాయకుడిలా మారిపోయారు. ఉద్యోగ ధర్మాన్ని పక్కనపెట్టి సోదరుడిని గెలిపించుకునేందుకు కుట్రలకు తెరతీశారు. సెలవుపెట్టి మరీ అభ్యర్థి తరఫున విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడమే గాక ప్రత్యర్థు లపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికారం కోసం తప్పుడు పనులకు పాల్పడే బదులు స్వయంగా ఖాకీ దుస్తులు తీసేసి ఎన్నికల్లో పోటీ చేస్తే సమంజసంగా ఉండేదని మల్యాల గ్రామస్తులు విమర్శిస్తున్నారు.

ప్యాపిలి మండలం జలదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో డ్యూటీ చేయాల్సిన కానిస్టేబుల్‌ మద్దిలేటి (పీసీ నంబర్‌ 1766) ఇటీవల డోన్‌ పట్టణ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మల్యాల సర్పంచ్‌ పదవి ఎస్సీకి రిజర్వ్‌ అయ్యింది. ఇక్కడ మూడో విడతలో డిసెంబర్‌ 2న పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా కానిస్టేబుల్‌ సోదరుడు చిన్న మద్దిలేటి బరిలోకి దిగారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ మద్దిలేటి తన విధులకు సెలవు పెట్టి సోదరుడి తరఫున విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడమే కాక గ్రామంలోని ఒక వర్గం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అన్నీ తానై సోదరుడిని గెలిపించుకునేందుకు కుట్రలకు తెరతీశారు. ఉద్యోగ ధర్మాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా ఫక్తు టీడీపీ కార్యకర్తగా మారిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు తటస్థ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయ డంతో పాటు మాటవినని వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాల నే లక్ష్యంతో వీరంగం సృష్టిస్తుండటంతో గ్రామస్తులు మంగళవారం నంద్యాలలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు సదరు కానిస్టేబుల్‌ను గ్రామంలోకి రాకుండా కట్టడి చేయడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రత్యర్థులపై అక్రమ కేసులు

టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి మల్యాల సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులతో పాటు మరో ముగ్గురిపై మంగళవారం డోన్‌ అర్బన్‌ స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నవంబర్‌ 1వ తేదీన డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వేలాది మంది బయటి వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమంగా ప్రవేశించి దొంగ ఓట్లు, సైక్లింగ్‌ ద్వారా ఓట్లు వేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజు 30 యాక్ట్‌ కింద గోప్యంగా నమోదు చేసిన ఈ కేసులో బుగ్గనతో పాటు మరికొందరు ఉన్నారనే విషయం సాకుగా తీసుకొని మంగళవారం గ్రామానికి చెందిన కూరపాటి మద్దిలేటి, ఎల్లప్ప, చాకలి నడిపి రంగస్వామి, గుడిసె మౌలాలి, కూరపాటి లక్ష్మిదేవి పేర్లను అదనంగా చేర్చారు. పోలింగ్‌ రోజు లోపు ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి ఆరెస్టు చేయడం ద్వారా ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలని కానిస్టేబుల్‌ మద్దిలేటి కుటుంబం టీడీపీ ప్రజాప్రతినిధుల అండ కోరినట్లు తెలిసింది. ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడే బదులు మద్దిలేటే స్వయంగా ఖాకీ దుస్తులు తీసేసి స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ధర్మంగా ఉండేదని మల్యాల గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement