బలపాలతిప్పలో సోలార్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
దిగ్భ్రాంతిలో తల్లిదండ్రులు, గ్రామస్తులు
కొత్తపల్లి: పిల్లలకు చిన్న దెబ్బతగిలినా తల్లి అల్లాడిపోతుంది. అలాంటిది కన్నతల్లి కళ్లెదుటే అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ అగ్ని కీలల్లో సజీవ దహనం అయితే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లి ఉంటుందో ఉహించుకుంటే ఓళ్లు గగుర్పొడుస్తుంది. ఈ ఘటన మంగళవారం మండలంలోని బలపాలతిప్ప గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మండలంలోని ఎర్రమఠం గ్రామ పంచాయతీ మజారా గ్రామం బలపాల తిప్ప నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ చెంచుగిరిజనులు ఎక్కువగా జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన కాట్రాజ్ ఈరన్న, భారతమ్మ గిరిజన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఐదేళ్ల ధర్మ కిరణ్ మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో పూరి గుడిసెకు బిగించిన సోలార్ ప్లాంట్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బాలుడి తండ్రి పొలానికి వెళ్లగా, తల్లి ఇంటి బయట బట్టలు ఉతుకుతోంది. తల్లి చూస్తుండగానే మంటలు గుడిసెను చుట్టుముట్టి పూర్తిగా దగ్ధం చేయగా, ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల ధర్మ కిరణ్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. తల్లి కళ్లెదుటే బిడ్డ అగ్నికి ఆహుతి కాగా ఈ విషాదం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. గ్రామస్తులకు కలచివేసింది.


