శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

Nov 24 2026 1:48 AM | Updated on Nov 24 2026 1:48 AM

ఆళ్లగడ్డ: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎప్పీ సునీల్‌ షోరాణ్‌ స్పష్టం చేశారు. మండల కేంద్రం చాగలమర్రిలో ఆదివారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో సోమవారం ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘర్షణ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి స్థానిక అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం అప్రమత్తంగా పోలీస్‌ శాఖ పని చేస్తోందన్నారు. చాగలమర్రిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నా రు. ఎన్నికల సమయంలో ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, ప్రజల భద్రతకు లేదా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతనిధులు సంయమనం పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఆర్‌ ఏఎస్పీ చిన్నికృష్ణ, డీఎస్పీ రవికుమార్‌ ఉన్నారు.

వీరభద్ర స్వామికి వెండి

కిరీటం, కవచం అందజేత

బేతంచెర్ల: పట్టణంలోని గౌరిపేటలో వెలసిన వీరభద్ర స్వామికి రూ. 2 లక్షల విలువ చేసే వెండి కిరీటం, కవచాన్ని సిమెంట్‌ నగర్‌ గ్రామానికి చెందిన ఇపూరి సుభాష్‌, సంతోషిని దంపతులు సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రూపు దేవాలయాల మాజీ చైర్మన్‌ గుండా జగన్‌, హిందూ ధార్మిక సంఘం నాయకులు హుసేన్‌ రెడ్డి, మధు మోహన్‌ రెడ్డి, నాగ మోహన్‌, చంద్రమౌలీశ్వర్‌ రెడ్డి, సత్యం, జీవన్‌ పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ

నంద్యాల(అర్బన్‌): పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి సోమవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రత, గోడౌన్‌ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, పర్యవేక్షణ విధానం గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం భద్రతా రికార్డులు, తనిఖీ రిజిస్టర్లు, ఇతర నిర్వహణ పత్రాలను పరిశీలించి, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడటంతో పాటు, గోడౌన్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ మనీషా, డీఆర్‌ఓ రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న సేవలో ..

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోతు హుస్సేన్‌ నాయక్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోతు హుస్సేన్‌నాయక్‌ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయు డు, ఈఓ శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోతు హుస్సేన్‌నాయక్‌ మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన చైర్మన్‌, ఈఓ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement