వైస్‌ చైర్మన్‌ పీఠం కోసం టీడీపీ దొంగ జీఓలు | - | Sakshi
Sakshi News home page

వైస్‌ చైర్మన్‌ పీఠం కోసం టీడీపీ దొంగ జీఓలు

Nov 24 2026 1:48 AM | Updated on Nov 24 2026 1:48 AM

మున్సిపల్‌ చరిత్రలో ఎంపీ, చైర్మన్‌కు ఓటు కల్పించటం ఇదే ప్రథమం

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ రోజమ్మను టీడీపీ నేతలు ఎక్కడ దాచిపెట్టారో ప్రజలకు చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి

బొమ్మలసత్రం: తమ పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులు నంద్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు దొంగ జీవోలు తెచ్చారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ జీవోలతో ఎంపీ, మున్సిపల్‌ చైర్మన్‌కు ఓటు కల్పించి వైస్‌ చైర్మన్‌ పీఠాన్ని అడ్డదారిలో దక్కించుకున్నారన్నారు. సోమవారం స్థానిక ఆయన నివాసంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాతో కలసి శిల్పా రవి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగిందన్నారు. ఈనెల 9వ తేదీ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ తరఫున 27 మంది కౌన్సిలర్లు గెలవడంతో 25 మంది మాత్రమే కౌన్సిలర్లు ఉన్న టీడీపీ కుట్రకు తెరలేపిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడో నందికొట్కూరు పరిధిలో ఉన్న ఎంపీ బైరెడ్డి శబరితో పాటు చైర్మన్‌ బాబన్‌కు ఓటు హక్కు కల్పించేందుకు దొంగ జీవోలను విడుదల చేశారన్నారు. ఈజీవోల కోసం 9న జరగాల్సిన వైస్‌ చైర్మన్‌ ఎన్నికను ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారన్నారు. ఇది సరిపోదన్నట్లు తమ పార్టీ మహిళా కౌన్సిలర్‌ ఎద్దు రోజమ్మను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి ఎక్కడో దాచి ఉంచారన్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాహాని కలగకుండా క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆయన కోరారు. ఎన్నికల్లో టీడీపీ నాయకుల దారుణాలను తాము ప్రశ్నిస్తామనే ఉద్దేశంతో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లతో అడ్డుకున్నారన్నారు.

నామినేషన్‌ రోజు నుంచి బెదిరింపులే..

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు తమ అభ్యర్థులను టీడీపీ నేతలు ఇబ్బందులకు గరిచేస్తూనే ఉన్నారన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ చూస్తే ప్రజాస్వామ్యాన్ని అధికారులు, పోలీసులు ఖూనీ చేశారని చెప్పవచ్చవన్నారు. ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు ప్రకటించాల్సిన కమిషనర్‌ బండి శేషన్న టీడీపీ నేతల అనుమతి తీసుకోవటం బాధాకరమన్నారు. మంత్రి కుమారున్ని పక్కనే కూర్చొబెట్టి ఓట్ల తారుమారుకు తెరలేపారని ఆరోపించారు. చైర్మన్‌ అభ్యర్థి ఓట్ల లెక్కింపునకు 26 టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా చేయకుండా అధికారులతో కలసి మోసానికి పాల్పడ్డారని విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో ఇదే తంతూ ..

గోస్పాడు మండలంలోని సాంబవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచిన వార్డు మెంబర్‌ గడ్డివామును టీడీపీ నాయకులు తగలబెట్టారన్నారు. పశువులు తినే గడ్డిమీద కూడా కూటమి నేతలు ఇంత కుట్రలు పన్నడం సరికాదన్నారు.కొందరు టీడీపీ నాయకులు అభ్యర్ధి దూడపిల్ల గొంతు కోసి హత్యచేయటం బాధాకరమన్నారు. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటి కుళాయి పైపులను ధ్వంసం చేయడం సరైందికాదన్నారు.

ఎంపీ తీరు సరికాదు

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా టీడీపీ కౌన్సిలర్‌ ఉప్పరి సుబ్రమాణ్యం పేరు ప్రస్తావించినప్పుడు టీడీపీ కౌన్సిలర్‌ శ్యామ్‌సుందర్‌లాల్‌ చేయి ఎత్తడంలేదని పక్కనే ఉన్న ఎంపీ బైరెడ్డి శబరి ఆయన చేతిని పైకి బలవంతంగా ఎత్తాలని చూడటం సరి కాదని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరించారన్నారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సమయంలో కూటమిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement