గడివేముల: గని గ్రామం నుంచి కొందరు భక్తులు ఏటా కార్తీకమాసంలో శ్రీశైలానికి పాదయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ భక్త బృందం 40వ సారి పాదయాత్ర ఆదివారం ప్రారంభించారు. దాదాపు 40 మంది భక్తులు ఓ కమిటీగా ఏర్పడి పాదయాత్ర ముందుకు కదిలారు. మార్గమధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే భోజన, వసతి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులను గ్రామస్తులు ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో గని ప్రతాపరెడ్డి, శివప్ప, భవాన్‌సింగ్, ప్రభాకర్‌రెడ్డి, శివరాజప్ప తదితరులు పాల్గొన్నారు.
మహిళపై హత్యాయత్నం
మహానంది: అనుమానంతో మహిళపై హత్యాయత్నానికి దారి తీసిన సంఘటన అబ్బీపురంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మహానంది ఎస్‌ఐ ఎల్.శివాంజల్ వివరాల మేరకు.. గ్రామం లోని ముసుగు సరోజకు గడివేముల మండలం బూజునూరుకు చెందిన సుబ్బరాయుడుతో వివాహమైంది. కొద్ది కాలానికి ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. సరోజ తన పుట్టినిల్‌లైన అబ్బీపురంలో కూలీ పనులతో పాటు బర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తుంది. మూడేళ్ల నుంచి గ్రామంలోని కోళ్ల కరుణయ్య అలియాస్ కర్ణతో కలిసి సహజీవనం చేస్తుంది. ఇటీవల 15 రోజుల నుంచి సరోజపై అనుమానం పెంచుకున్న కర్ణ చంపుతానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పాలకేంద్రం వద్ద పాలు పోసి వెళ్తున్న సరోజపై కర్ణ గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. సరోజ కుమార్తె బిందుప్రియ ఫిర్యాదు మేరకు కర్ణపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
కోసిగి: మండల పరిధిలోని దొడ్డి గ్రామానికి చెందిన తాయప్ప, బసవరాజు అనే ఇద్దరు వ్యక్తులు సోమవారం అక్రమంగా మూడు బాక్స్‌లలో 144 మద్యం బాటిళ్లను తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్‌ఐ రమేష్ రెడ్డి తెలిపారు. ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా.. విక్రయాలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
విద్యుత్ మోటర్లు, వైర్లు చోరీ
గోనెగండ్ల: మండలంలో గత కొద్ది రోజుల నుంచి పంట పొలాల్లో విద్యుత్ మోటర్లు, వైర్ల చోరీ జరుగుతుంది. దీని వల్ల పంటలకు నీళ్లు పెట్టలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి మండలంలోని గంజిహళ్లి గ్రామంలో పార్వతి, బెనర్జీ, యోగనంద్, రాముడు, మద్దిలేటి, రంగన్న, నరసింహుడు, కుబేర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, ఉసేన్ తదితర రైతుల పంట పొలాల్లో 15 విద్యుత్ మోటర్లు, వైర్లను ఎత్తుకెళ్లారు. ఉదయం పొలాలకు వెళ్లిన ఆ రైతులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


