● ఏర్పాట్లు చేసిన శ్రీశైల దేవస్థాన అధికారులు
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసంలో పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజున దేవస్థానం దేదీప్యమానంగా జ్వాలాతోరణోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం గంగాధర మండపం వద్ద దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. జ్వాలాతోరణోత్సవాన్ని భక్తులు అధికసంఖ్యలో వీక్షించేలా చర్యలు చేపట్టారు. నేతితో తడిపిన నూలు వత్తులను ఏర్పాటు చేసి తిరిగి నెయ్యి పోసి వత్తులను వెలిగిస్తారు. ఇది తోరణంగా వెలుగుతుంది. తోరణంలో కాలిన నూలు వత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ఈ విధంగా ధరించడం వలన ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్వాలాతోరణోత్సవంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా విశేష పూజాదికాలను నిర్వహించి జ్వాలాతోరణం చుట్టు మూడుసార్లు స్వామిఅమ్మవార్ల పల్లకీని తిప్పుతారు.
శివపార్వతులతో ముడిపడిన పురాణగాఽథ..
పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు కలసి క్షీరసాగరాన్ని మధించారట. అందుకు భూమధ్యలో ఉన్న మంధర పర్వతాన్ని కవ్వంగా, కవ్వానికి వాసుకీ సర్పాన్ని తాడుగా చేసుకుని పర్వతాన్ని సముద్రంలోకి దించగానే అది పట్టు తప్పి పడిపోయిందట. దీనితో పర్వతాన్ని పైకి లేపేందుకు శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి సాగరంలోకి వెళ్లి తన వీపుతో పర్వతాన్ని ఎత్తగా..దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించగా. అందులోనుంచి మొదట హాలాహలం జనించిందట సకల లోకాలనూ దహించివేయగల కాలకూట విషమైన దానిని పరమశివుడు లోకహితం కోసం దానిని సేవించాడని గాథ. దానిని కంఠంలో ఉంచుకోవడంతో శివుడికంఠం నీలంగా మారింది. దీనిని చూసి భయాందోళనకు గురైన పార్వతీదేవి తన భర్తకు ఏ కీడు తగలకుండా ఈ ఆపద నుంచి బయటపడితే భర్తతో పాటు తాను చిచ్చుల తోరణం కింద మూడుసార్లు నడిచి వస్తాను అని అనుకుందట. తర్వాత శివుడికి ఎటువంటి ఆపద కలగకపోవడంతో పార్వతీదేవి శివుడితో కలిసి కార్తీక పౌర్ణమినాడు జ్వాలాతోరణం కింద మూడుసార్లు నడిచినట్లు అప్పటి నుంచి జ్వాలాతోరణోత్సవం ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు.


