హొళగుంద: మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామ సమీపంలో హచ్చొళ్లి డిస్ట్రిబ్యూటరీ కాలువ వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గజ్జహళ్లి గ్రామానికి చెందిన జయమ్మ దంపతులు ఆదివారం రాత్రి మనువరాలు చిన్ని (3 ఏళ్లు )తో కలిసి ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. ఊరికి సమీపంలోని కాలువ వద్ద ఆటో అదుపు తప్పి ఓ వైపు ఒరిగిపోయింది. ఈ ఘటనలో చిన్నారితో పాటు జయమ్మ ఎగిరి కింద పడిపోయారు. చికిత్స నిమిత్తం స్థానికులు ఇద్దరిని ఆదోని ఆసు పత్రికి తరలించారు. అయితే, చేతికి తీవ్ర గాయమైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసు పత్రిలో చేర్పించారు. పాప చేతికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, రూ.2 లక్షల కు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. కూలీ పనులు చేస్తూ జీవించే తమకు అంత మొత్తం చెల్లించి ఆపరేషన్ చేయించే స్తోమత లేదని, దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని చిన్నారి తల్లిదండ్రలు ఎర్రిస్వామి, కవిత కోరుతున్నారు.


