కొత్తపల్లి: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీడీపీని వీడి వైఎస్సార్సీలో చేరేవారు ఎక్కువయ్యారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పర్యటించారు. దుద్యాల గ్రామంలో 20 కుటుంబాలతో పాటు టీడీపీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ సుంకరి మన్సూర్వలీ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కె.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డిల పనితీరుపై అసంతృప్తితో వైఎస్సార్సీపీలో చేరినట్లు మన్సూర్వలీ చెప్పారు. పార్టీ కోసం కష్టపడే వారికి టీడీపీలో విలువలు లేవని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేసే వారి గెలుపుకోసం కృషి చేయాలని బైరెడ్డి సిద్ధారెడ్డి సూచించారు.


