● ఉయ్యలవాడలో రోడ్డెక్కిన పచ్చ రచ్చ
● ఎంపీపీ ఎన్నిక సందర్భంగా
ఇరువర్గాల ఘర్షణ
● ఎన్నిక వాయిదా వేసిన అధికారులు
ఆళ్లగడ్డ/ఉయ్యాలవాడ: ఉయ్యాలవాడ మండలంలో నిన్న, మెన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ వర్గ విభేదాలు ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సొంత పార్టీ నేతల నుంచే ఊహించని షాక్ తగిలింది. ఎంపీటీసీలు అన్నీ ఏకగ్రీవం చేసుకున్నాం.. ఇక ఎంపీపీ ఎన్నిక లాంఛనమే అనుకున్న తరుణంలో ఐదుగురు ఎంపీటీసీల్లో ఏకంగా ముగ్గురు అసమ్మతి వర్గంగా ఏర్పడి ఎమ్మెల్యేకు ఝలక్ ఇవ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిషత్ ఎన్నికల్లో మండలంలో 8 ఎంపీటీసీలు ఉండగా టీడీపీకి 5, జనసేనకు 1, వైఎస్సార్‌సీపీకి 2 ఎంపిటీసీలు దక్కించుకున్నాయి. జనసేనతో కలిపి ఆరుగురు బలం ఉండటంతో కర్ర రమేష్‌రెడ్డి వర్గానికి చెందిన మాయలూరు ఎంపీటీసీ బండిమరియమ్మను ఎంపీపీగా, కర్ర రమేష్‌రెడ్డి వైస్ ఎంపీపీగా ఎమ్మెల్యే ప్రకటించారు. అయితే ఇందులో బోడెమ్మనూరు ఎంపీటీసీ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఎంపీటీసీలు అసమ్మతి వర్గంగా మారి ఎమ్మెల్యే అఖిలప్రియ సూచించిన వారిని కాదని ఆర్ జమ్ములదిన్నె ఎంపీటీసీ బాలనరసింహులు ఎంపీపీగా, తనను వైస్ ఎంపీపీగా ఎన్నుకోవాలని పట్టుబడ్డంతో ఉదయం జరగాల్సిన ఎన్నిక సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. మీలో ఎవరు ఎంపీపీగా పోటీలో ఉంటారో చెప్పండి అనగానే అసమ్మతి వర్గం ఎంపీటీసీ హరిప్రసాద్‌రెడ్డి ఎంపీపీగా బాలనరసింహుడును ప్రతిపాదిస్తున్నాని చెప్పడం కలకలం రేపింది. బాలనరసింహుడిని బలపరిచేవారు చేతులెత్తాలని ఆర్వో సూచించడంతో ముగ్గురు ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. దీంతో జనసేన ఎంపీటీసీతో కలిసి ఎమ్మె ల్యే వర్గానికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు ఇద్దరు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. కోరం లేకపోవడంతో ఉయ్యాలవాడ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు వాయి దా వేస్తున్నట్లు, తిరిగి శుక్రవారం నిర్వహిస్తామని ఎన్నికల అధికారి నాగమున్నేశ్వరి ప్రకటించారు.


