● సున్నిపెంటలో నామినేషన్లను బహిష్కరించిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని శిఖరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సున్నిపెంటలో అడుగు పెట్టకూడదంటూ వేలుచూపుతూ డీఎస్పీ రామాంజనేయులు హెచ్చరించారు. చేతులతో నెడుతూ కారులోకి ఎక్కించారు. అనంతరం బలవంతంగా మాజీ ఎమ్మెల్యేను నంద్యాలకు తరలించారు. అలాగే వైఎస్సార్సీపీ మద్దతుదారులు సున్నిపెంట గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా చేశారు. గురువారం మధ్యాహ్నం 01:30 నుంచి దగ్గరుండి నామినేషన్ కేంద్రానికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇచ్చి అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు భరోసా ఇవ్వాలనే కాంక్షతో సున్నిపెంటకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డిని శిఖరం వద్ద పోలీసులు అడ్డుకొని వెనక్కు పంపారు. నామినేషన్లు వేయడానికి సిద్ధమైన వైఎస్సార్సీపీ మద్దతుదారులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. నామినేషన్ పత్రాలు చేతపట్టుకొని ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కులేదా.. ఇదేమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ల దాఖలును బహిష్కరించి న్యాయపరంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు.


