కర్నూలు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం లింగాపురం గ్రామానికి చెందిన అవిజ దానమ్మ (62)ను కర్నూలు శివారు వద్ద ఎన్‌హెచ్ – 44లో కారు ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈమె కొడుకు, కోడలు కర్నూలు శ్రీకృష్ణ కాలనీలో నివాసముంటారు. కొంతకాలంగా వారి వద్ద ఉంటూ కర్నూలు శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారి డోన్‌కు వెళ్లే మార్గంలోని పిస్తా హౌస్ పక్కన ఉన్న జీవీఆర్ బార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం రాత్రి బార్‌లో పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. బెంగుళూరు నుంచి హైదరాబాదు వైపు వెళ్లే రోడ్డులో వెల్కమ్ సూపర్ మార్కెట్ ముందు రాత్రి 11 గంటల సమయంలో వెనుక వైపు నుంచి ఏపీ 39 ఏసీ 7999 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ మార్గంలో వెళ్లిన వారు బార్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రక్త గాయాలతో పడిఉన్న వృద్ధురాలిని ప్రైవేటు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మార్చురీకి తరలించారు. మృతురాలి చిన్న కుమారుడు చిన్న నాగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.


