బేతంచెర్ల: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో పాడి పశువులు కలిగిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో నీటి వసతి కలిగిన రైతులు వరి పంట సాగు చేయడంతో అక్కడి నుంచి ట్రాక్టర్లలో వరిగడ్డిని బేతంచెర్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉన్న ట్రాక్టర్ వరిగడ్డి ధర ప్రస్తుతం కొరత కారణంగా రూ.20 వేల వరకు చేరింది. దీంతో పశుగ్రాసం కొనుగోలు చేసేందుకు పశుపోషకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు పశువుల మేత ఖర్చులు పెరగడం, మరో వైపు పాల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం అందించాలని పాడి రైతులు కోరుతున్నారు. పశువుల మేత కొరతను నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


