కోసిగి: ఒక వైపు సర్పంచ్‌ల నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే.. మరో వైపు పేదలు బతుకు తెరువు కోసం గ్రామం వదిలి వలస బాట పడుతున్నారు. సర్పంచ్ ఎవరైనా తమ బతుకు మారేది లేదని, పనులు చేసుకోకపోతే పూటగడవడం కష్టం అవుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 60 కుటుంబాలు బుధవారం కోసిగి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో గ్రామంలో పనులు దొరకడం కష్టంగా మారింది. కొన్నాళ్ల పాటు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో పత్తి తీసే పనులు చేసి గ్రామం చేరుకున్నారు. అక్కడ పనులు ముగియడంతో పట్టణాలకు వెళుతున్నట్లు కూలీలు తెలిపారు. తిరుపతి పట్టణంలో ఇంటి నిర్మాణ పనులు, ఇతర పనులు చేసుకుంటామని చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో బోర్లు సైతం అడుగంటి పోవడంతో రైతులు పిల్లపాపలతో మూటముళ్లె సర్దుకుని గ్రామాలు వదిలి రోజు వారిగా తరలి వెళ్లుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణంగా ఉందని కూలీలు ఆరోపించారు. కూలీలను, రైతులను ఆదుకునే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కాత్రికి నుంచి 70 కుటుంబాల వలస బాట
కౌతాళం: తీవ్ర వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడం, ప్రభుత్వం, అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో వలస కూలీలు హైదరాబాద్ వంటి పట్టణాలకు వలస వెళుతున్నారు. బుధవారం ఒకే రోజు మండల పరిధిలోని కాత్రికి గ్రామం నుంచి 70 కుటుంబాలు తరలివెళ్లారు. గ్రామంలో ఉపాధి లేకపోవడంతో వలసలు తప్పడం లేదని గ్రామస్తులు పెద్ద మారెమ్మ పలువురు తెలిపారు. గ్రామంలో పనులు లేక జీవనం కష్టంగా మారిందని తెలంగాణలో మిరప పంట ఇతర పంటల పనులు మొదలయ్యాయని, ఇక్కడే ఉంటే పూటగడవడం కష్టమవుతుందని అందుకే పిల్లపాపలతో వలస వెళుతున్నట్లు చెప్పారు.


