● బస్టాండులో తలదాచుకుంటున్న వృద్ధురాలు ● రాత్రిళ్లు చలికి అవస్థలు
ఆలూరు: వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లి వారికి భారమైంది. కష్టం చేసుకుని బతికే శక్తి లేని అభాగ్యురాలికి జీవనాధారంగా లభిస్తున్న పింఛన్ సొమ్ముపై వారికి ఆశ పుట్టింది. పింఛన్ సొమ్ములో సగం తమకివ్వాలని లేకుంటే అన్నం పెట్టేది లేదంటూ అల్లుడు నిర్ధాక్షిణ్యంగా గెంటేశాడు. నిస్సహాయురాలైన కుమార్తె అడ్డు చెప్పలేకపోయింది. వృద్ధాప్యంలో చలికి వణుకుతూ ఆ అభాగ్యురాలు బస్టాండులో తలదాచుకుని బతుకీడుస్తోంది.
వివరాలు.. పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఆచారి వెంకటేశప్ప, సుభద్రమ్మ దంపతులకు రఘుఆచారి, లలితమ్మ సంతానం. బతుకు దెరువు కోసం రఘ ఆచారి బెంగళూరు వెళ్లిపోయారు. ఈ క్రమంలో భర్త వెంకటేశప్ప మూడేళ్ల క్రితం మృతి చెందారు. కుమారుడు రఘు అనారోగ్యంతో ఏడాది కిందట మృతి చెందడంతో సుభద్రమ్మ అక్కడ ఒంటరిగా ఉండలేక మనేకుర్తి గ్రామంలో కుమార్తె లలితమ్మ, అల్లుడు రామిరెడ్డి వద్దకు చేరింది. మొదట వారు బాగానే చూసుకున్నారు. సుభద్రమ్మకు వచ్చే వృధాప్య పింఛన్ రూ.4 వేలపై వారికి ఆశ పుట్టింది. భోజన ఖర్చులకు ప్రతినెలా పింఛన్ సొమ్ము నుంచి రూ.2 వేలు ఇవ్వాలని అడిగారు. ఆమె ఒప్పుకోకపోవడంతో తిండి పెట్టేది లేదని బయటకు గెంటేశారు. దీంతో సుభద్రమ్మ చేసేది లేక గ్రామంలో ఉన్న బస్టాండు వద్ద తలదాచుకుంటోంది. బస్టాండులో విద్యుత్ సదుపాయం లేదు. రాత్రిళ్లు విష పురుగుల బెడద ఉంటుంది. అయినా పగటి పూట వంట చేసుకుని తిని రాత్రిళ్లు చలికి వణుకుతూ ధీనస్థితిలో బతుకీడుస్తోంది. తమకున్న నాలుగెకరాల భూమిని అమ్ముకోగా వచ్చిన నగదును కుమార్తె, అల్లుడు, కుమారుడికి ఇచ్చామని ప్రస్తుతం వారు దూరం కావడంతో తన ధీనస్థితికి కారణం ఎవరని చెప్పను బాబు అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.


