శ్రీశైలం: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి ఆదివారం ప్రారంభమైన భక్తుల రద్దీ మంగళవారం కూడా కొనసాగింది. పవిత్ర పుణ్య నది స్నానాలు కార్తీక దీపారాధనలు, వ్రత నోములను భక్తులు నిర్వహించుకున్నారు. ఉచిత ప్రత్యేక దర్శన క్యూలు, క్యూ కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్యూలలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు, యాత్రికులకు అల్పాహారం అందేలా ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో స్పర్శదర్శనం టికెట్లు తీసుకున్న, ప్రోటోకాల్లో ఉన్న వారిని మాత్రమే నాలుగు విడతలుగా అనుమతించారు.


