నంద్యాల(అర్బన్): ఈ నెల 20న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం ఆమె పట్టణంలోని జెడ్పీ కార్యాలయాన్ని పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిబంధనల ప్రకారం సజావుగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాగరాజు, ఎంపీడీఓ సుగుణ తదితరులు ఉన్నారు.
బస్సులో సీటు కోసం ఫీట్లు
● మహానందిలో భక్తుల అవస్థలు
మహానంది: కార్తీకమాసం, మొదటి సోమవారం సందర్భంగా మహానంది ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చారు. శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వెళ్లేందుకు వందలాది మంది బస్సు కోసం వేచి ఉన్నారు. తీరా బస్సు రావడంతో సీటు కోసం అవస్థలు పడ్డారు. ప్రయాణికులు దిగుతుండగానే ఎక్కేందుకు ప్రయత్నించడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాల్లో మహానందికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు పెంచడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి.
పోలీసు జాగిలం జానీ మృతి
బొమ్మలసత్రం: పోలీస్ శాఖకు సంబంధించిన జాగిలం జానీ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందింది. వీవీఐపీల భద్రత విధుల్లో విశిష్ట సేవలందించిన ఈ జాగిలం మరణ వార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ సునీల్‌షొరాణ్ స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జానీ సేవలందించిందని చెప్పారు. శ్రీశైలం, తిరుపతి లాంటి ప్రధాన క్షేత్రాలతో పాటు 300కు పైగా వీవీఐపీ కార్యక్రమాల్లో విధు లు నిర్వహించినట్లు వెల్లడించారు. అడినషల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు జానీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఎస్పీని కలిసిన కాటసాని
కల్లూరు: వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతుంటే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దొమ్మరి మధు అడ్డుకున్నారని తెలిపారు. అడ్డుకున్న దొమ్మరి మధుపై టీడీపీ నాయకులు దాడి చేయడంతోపాటు అక్రమంగా కేసులు నమోదు చేయించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.


