నంద్యాల(న్యూటౌన్): ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అంతర్ జిల్లాల అండర్–19 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు జరుగనున్నాయి. నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి 312 మంది క్రీడాకారులు, 52 మంది కోచ్ మేనేజర్లు, 40 మంది టెక్నికల్ వ్యాయామ ఉపాధ్యాయులు రానున్నట్లు ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ విజయభాస్కరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి డీవీఈఓ సురేష్‌బాబు, ఆర్‌ఐఓ లాలెప్ప, డీఐఈఓ శంకర్‌నాయక్, డీఈఓ జనార్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.
29న బలిజ వంశీయుల కార్తీక వన భోజనాలు
నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీన పట్టణ బలిజ వంశీయుల కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వన భోజన మహోత్సవ గౌరవాధ్యక్షుడు మిద్దె శాంతిరాం, వర్ధంశెట్టి రాజారాం, పరమేశ్వర రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బలిజ కల్యాణ మండపంలో విడుదల చేసి మాట్లాడారు. చిన్నచెరువు కట్ట వద్ద ఉన్న నూతన బలిజ కల్యాణ మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మహానందిలో భక్తజన సందడి
మహానంది: కార్తీక మాసం, మొదటి సోమవారం సందర్భంగా మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడాయి. వేకువజాము నుంచి ప్రారంభమైన కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి దర్శనం రాత్రి వరకు సాగింది. ఉదయం, సాయంత్రం భక్తులు ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించడంతో కార్తీక దీప శోభ సంతరించుకుంది. భక్తులరద్దీ నేపథ్యంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్థానిక కళ్యాణ మండపంలో భక్తుల చేత వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంతుశర్మ, శాంతారాంభట్, అర్చకులు సామూహిక అభిషేకాలు చేయించారు. కాగా
సాధారణ దర్శనానికి గంటల తరబడి సమయం పడటంతో వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గర్భాలయం ముందు ఉన్న నంది వెనుక నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పించండంతో స్వయంభువుగా కొలువైన మహానందీశ్వర స్వామి సరిగా కనిపించలేదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒకేఒక ప్రసాదాల విక్రయాల కౌంటర్ తెరవడంతో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


