● రాత్రికి రాత్రే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
మార్చిన అధికారులు
● రెండో దశలో ఉన్న నందికొట్కూరును
మూడో దశలోకి..
● మూడో దశలో ఉన్న బనగానపల్లెను
రెండో దశలోకి మార్చిన వైనం
● అలాగే మొదటి దశలో ఉన్న మహానందిని
రెండోదశకు మార్పు
● పట్టు కోసం పచ్చ వ్యూహమా ?
సాక్షి, నంద్యాల: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీలు చాలా కీలకం. అలాంటి పంచాయతీలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పంచాయతీల అభివృద్ధిని గాలికొదిలేసింది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేప థ్యంలో పంచాయతీ ఎన్నికల సమరానికి ఆయా పార్టీల మద్దతుదారులు సిద్ధమయ్యారు. యథావిధిగానే మూడుదశల్లో ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల
సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీలు, చివరి అభ్యర్థుల జాబితా, పోలింగ్ తేదీ ఇలా అన్ని రకాల తేదీలను ప్రకటించారు. మొదటి దశ ఈనెల 26న, రెండోదశ 29, మూడోదశ డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో 28 మండలాల్లో 489 పంచాయతీలు, 4,920 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొదటి, రెండు, మూడో దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 5,085 పోలింగ్ కేంద్రాలను కూడా ప్రకటించారు. మొదటి విడతలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఉన్న పంచాయతీలకు మొదటగా ఎన్నికలు నిర్వహించాలని తలపించారు. అయితే ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న మహానంది కూడా మొదటి దశలో ఉంది. కాని గురువారం రాత్రికి రాత్రి షెడ్యూల్ మార్చి రెండో దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. బెదిరింపులు, దౌర్జన్యాలను తట్టుకొని నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించింది. ఇది పట్టని కూటమి ప్రభుత్వం ముందుగానే తమకు అనుకూలంగా ఉండేలా మొదటి దశ, రెండో దశలోనే ముగించేసుకోవాలని పన్నాగం పన్నింది. రెవెన్యూ డివిజన్ల వారి కాకుండా నియోజకవర్గాల వారీగా మార్పులు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.
సీఎం మీటింగ్ కోసమేనా..?
జిల్లాలో ఓ అమాత్యుడికి అనుగుణంగా పంచాయతీ ఎన్నికల దశను మార్చినట్లు పలు పార్టీల నాయకులు, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. డిసెంబర్ 4వ తేదీన తిరుపతిలో సీఎం చంద్రబాబు కార్యక్రమం ఉన్నందున ఆ ప్రజాప్రతినిధి హాజరు కావాల్సి ఉంటు ంది. కాని మూడో దశ డిసెంబర్ 2వ తేదీన ఆ అమాత్యుడి నియోజకవర్గంలో ఎన్నికలు ఉండటంతో సీఎం కార్యక్రమానికి వెళ్లడం కష్టమని మూడో దశ నుంచి రెండో దశ ఈనెల 29వ తేదీకి మార్చారని చర్చ జరుగు తోంది. నందికొట్కూరును మూడో దశలోకి మార్చ డం వెనుక వైఎస్సార్‌సీపీ మద్దుతుదారుల విజయాన్ని అడ్డుకునేందుకేనా అనే అనుమానం కలుగుతోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడంతో పలు స్థానాల్లో పట్టు నిలుపుకున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను పోలీసులతో అక్రమ కేసులని భయపెట్టేందుకు మూడోదశకు మార్చారేమోనని అనుమానం వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగుల ఉరుకులు పరుగులు
రెండోదశ పోలింగ్‌లో మార్పులు చేయడంతో అటు పోటీ చేసే అభ్యర్థుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడనున్నారు. పోలింగ్ కేంద్రాలు, ఏర్పాటు, సిబ్బంది ఏర్పాటు, బందోబస్తు సిబ్బంది అంశాలపై పరుగుపెట్టాల్సి ఉంటుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల పత్రాలు, పన్నుల చెల్లింపులు తదితర ధ్రువపత్రాలను సేకరించాల్సి ఉంటుంది. ఏదేమైనా పోలింగ్ దశల మార్పు అన్ని వర్గాలకు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది.
ఓటర్ల ఇబ్బందులెన్నో?
ముఖ్యంగా పంచాయతీల పోలింగ్ మార్పు కారణంగా అన్ని రంగాల్లో పని చేస్తున్న వారి మీద ప్రభావం చూపుతోంది. ఆయా గ్రామాల్లో ఉద్యోగం కోసం వేరే ఊళ్లకు వెళ్లిన వారు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈనెల 29న పోలింగ్ ఉండగా 28వ తేదీనే వలస వెళ్లిన వారు ఊళ్లకు వస్తారు. అందుకనుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అకస్మాత్తుగా పోలింగ్ తేదీ మారడంతో షెడ్యూల్‌ను రెండో 26వ తేదీన ఓటేసే వారు డిసెంబర్ 2కు మార్చుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, పుణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారు పంచాయతీల్లో ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు. రైళ్లు, బస్సులు తదితర రవాణా మార్గాల ద్వారా రిజర్వేషన్‌లను ఇప్పటికే చేసుకున్నారు. తేదీలు మారడంతో మళ్లీ రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తోందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర ప్రైవేటు ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, బేల్దారి కూలీలు, ఇతరత్రా పనుల కోసం ఎక్కువగా హైదరాబాద్‌కు వలస వెళ్తుంటారు. దీంతో ఓట్లు వేయించుకొనే అభ్యర్థులకు తలనొప్పిగా మారింది.


