● రికార్డు స్థాయిలో ఒక్కరోజు
రూ.15 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.15 లక్షల విరాళాలు అందించారు. ఒక్కరోజు వ్యవధిలో ఇంతపెద్ద భారీ మొత్తం విరాళాలు రావడం రికార్డ్ స్థాయి అని చెప్పవచ్చు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన పి.మాధవరావు రూ.10 లక్షల విరాళాన్ని దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన జి.నరసింగరావు రూ.4 లక్షల విరాళాన్ని పర్యవేక్షకులు కోమలికి అందజేశారు. అలాగే పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన పయ్యావుల వెంకట నవీన్‌కుమార్ రూ.1,50,265 విరాళాన్ని అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
శ్రీగిరిలో కార్తీక రద్దీ
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుటున్నారు. కార్తీక మొదటి ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయ ఉత్తర మాఢవీధిలో, గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భక్తులందరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. క్యూ కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులకు కట్టుపొంగలి, పులిహోర, బిస్కెట్లు, మంచినీటితో పాటు ఉదయం వేళలో వేడిపాలు అందజేశారు. సోమవారం లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తగ్గని దారుణాలు.. మోసాలు
● జిల్లాలో పది నెలల నేర వివరాలు వెల్లడి
బొమ్మలసత్రం: అమాయకులను బెదిరించి బలవంతంగా ఆస్తులు, విలువైన వస్తువులు కాజేసిన కేసులు జిల్లాలో గత ఏడాది తో పోలిస్తే తగ్గలేదు. ఆదివారం జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ జిల్లాలో ఈ ఏడాది 10 నెలల కాలంలో నమోదైన నేరాల వివరాలను ఆదివారం పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేశారు. అయితే గత ఏడాది నమోదైన నేరాలకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జరిగిన నేరాలతో పోలిస్తే ఏ మాత్రం తగ్గలేదు. ఎస్పీ వెల్లడించిన నేరాల సంఖ్యను పరిశీలిస్తే దోపిడీ కేసులు గత ఏడాది 9 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది కేవలం 10 నెలల కాలంలోనే 9 నమోదు కావటంతో పోలీసులు నిందితులను కట్టడి చేయటంలో విఫలమైనట్లు అర్థమవుతుంది. 2025లో ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలు 47 ఉండగా ఈ ఏడాది అక్టోబర్ నెల నాటికి 42 కేసులు నమోదయ్యాయి. సాధారణ నేరాలు గత ఏడాది 530 కేసులు నమోదైతే 10 నెలల్లోనే 474 కేసులు నమోదయ్యాయి. చీటింగ్ కేసులు గతంలో 153 కేసులు నమోదైతే ఇప్పటికే 92 కేసులు నమోదయ్యాయి. దోపిడీ, బందిపోటు, రాత్రి, పగలు జరిగిన చోరీలు గత ఏడాది 100 కేసులు నమోదైతే ఈఏడాది 82 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది పోక్సో కేసులు 47 నమోదు కాగా ఈ 10 నెలల కాలంలోనే 35 చోటుచేసుకున్నాయి. గతంలో 9 కిడ్నాప్‌లు చోటుచేసుకోగా ఏడాది ముగియకముందే 8 కేసులు నమోదయ్యాయి. 2025లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య 244 అయితే ఇప్పటికే 221 మంది ప్రమాదంలో మృతిచెందారు.


