సంజీవనితో ఆసుపత్రుల అనుసంధానం | - | Sakshi
Sakshi News home page

సంజీవనితో ఆసుపత్రుల అనుసంధానం

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(న్యూటౌన్‌): ప్రభుత్వ వైద్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు సంజీవని యాప్‌ ద్వారా జిల్లాలోని అన్ని స్థాయిల ప్రభుత్వ ఆసుపత్రులను ఒకే డిజిటల్‌ వేదికపైకి అనుసంధానించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో సంజీవని ఆరోగ్య సేవల సమగ్ర అమలు, పురోగతి, క్షేత్రస్థాయి కార్యాచరణపై వైద్యాధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సంజీవని కార్యక్రమం అమలులో ప్రతి వైద్యాధికారి పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫారాన్ని వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అనుసంధానం, నిరంతర వైద్య సేవలు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, రోగి కేంద్రిత వైద్యం, ప్రజలకు చేరువలో ఆరోగ్య సేవలు అనే ఐదు ప్రధాన సూత్రాల ఆధారంగా సంజీవని కార్యక్రమం అమలవుతుందని కలెక్టర్‌ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 19 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిధిలో సంజీవని సేవలను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలులో 131 మంది వైద్యులు, 172 మంది స్టాఫ్‌ నర్సులు, 344 మంది కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, 533 మంది ఏఎన్‌ఎంలు, 1,579 మంది ఆశా కార్యకర్తలు భాగస్వాములు కానున్నారన్నారు. వీరందరి సమన్వయంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. మరింత సమాచారం కోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ 155337కు సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఇనన్‌చార్జ్‌ డాక్టర్‌ శారదాబాయి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత, డీఈఓ జనార్దన్‌ రెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, టాటా ఎండీ ప్రతినిధులు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement