15 ఎకరాల భూమి ఖాళీగా ఉంచుకున్నాం
కరువు కోరల్లో ఉమ్మడి జిల్లా
కర్నూలు(అగ్రికల్చర్): ఐదారు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలవని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జిల్లా చరిత్రలో ఎన్న డూ చూడని విధంగా ఖరీఫ్ సీజన్ దెబ్బతినింది. వర్షాభావ ప్రభావం రబీ సీజన్‌పైనా చూపుతోంది. భూమి లో తేమ లేకపోవడంతో రబీ ముందుకు సాగని పరిస్థితి. ఖరీఫ్ సీజన్‌లో వర్షాధారం కింద సాగు చేసిన అన్ని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది హెక్టార్లలో దిగుబడులు సున్నా. కరువు ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో ఒక మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత 2024–25, 2025–26లో అతివృష్టి, అనావృష్టి వల్ల వ్యవసాయం కలసి రాలేదు. 2026–27లో ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం అనేదే లేకుండా పోయింది.
రబీలోనూ ముఖం చాటేసిన వరుణుడు
రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి మొదలైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నైరుతి రుతుపవాలు ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపలేదు. రబీ పంటల సాగుకు ఈశాన్య రుతుపవనాలు సహకరించాల్సి ఉండగా.. వీటి జాడే లేకపోయింది. రబీ మొదలై 40 రోజులు దాటిపోయినా వరుణుడు కరుణించని పరిస్థితి. అర్నబ్, మురసు తుపానులు సైతం ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. రబీలో నంద్యాల జిల్లాలో నీటి ఆధారం కింద వరి, మొక్కజొన్న, మినుము ఎక్కువగా సాగవుతుంది. ఈ సారి నీటి పారుదల రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. కానీ సాగు అద్భుతంగా ఉందని అంకెలు చూపుతుండటం గమనార్హం. ఖరీఫ్‌లో సాగు లేకపోయినప్పటికీ ఎక్కువ విస్తీర్ణం చూపడం వల్ల ఆరు మండలాలకు కరువు మండలాల జాబితాలో స్థానం లేకుండా పోయింది. రబీలో సాగే లేకపోయినప్పటికీ కర్నూలు జిల్లాలో 31385 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 60 వేలకుపైగా హెక్టార్లలో పంటలు సాగయినట్లు లెక్కలు చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అమ్మకానికి సబ్సిడీ విత్తనాలు
సబ్సిడీపై ఉమ్మడి జిల్లాలో 40వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు పంపిణీ చేశారు. వర్షాలు లేక భూమిలో తేమ కరువై విత్తుకు అవకాశం లేక శనగ విత్తనాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో శనగ 22,465 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 9,541 హెక్టార్లలో మాత్రమే సాగయింది. విత్తనాలు సిద్ధం చేసి పెట్టుకున్నా వర్షాలు లేకపోవడంతో శనగ విత్తనాలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
జూన్ నుంచి వర్షాలు కరువే..
ఈ ఏడాది జూన్ నుంచి వర్షాలు కరువయ్యాయి. ఒక్క నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు. జూన్ నుంచి నవంబర్ నెల వరకు కర్నూలు జిల్లాలో సాధారణ వర్షపాతం 540.5 మి.మీ ఉండగా 252.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. నంద్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 622.2 మి.మీ ఉండగా 315.6 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. కర్నూలు జిల్లాలో చెరు వులు, కుంటలు 267, నంద్యాల జిల్లాలో 253 ఉండగా.. 75 శాతం చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. 25 శాతం చెరువులు, కంటల్లో 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే నీరు ఉంది. ఇదిలాఉంటే 2025 అక్టోబర్ నెలలో భూగర్భ జలాలు 4.77 మీటర్లలో ఉండగా.. 2026 అక్టోబర్‌లో 8.72 మీటర్ల అడుగుకు వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పంటల బీమా ఊసే కరువు
చంద్రబాబు సర్కార్ ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్క రైతుకు కూడా పంటల బీమా కింద పరిహారం అందించిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమాను సైతం ఈ ప్రభుత్వం గంగలో కలిపేసింది. 2023 ఖరీఫ్ నుంచి 2023–24 రబీ, 2025 ఖరీఫ్, 2025–26 రబీ.. 2026 ఖరీఫ్ వరకు పంటల బీమా అనేదే లేకుండా పోయింది. 2025 ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై కింద 21,730, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద 13,920 మంది రైతులు పంటల బీమాకు ప్రీమియం చెల్లించారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1,73,516 మంది రైతులు 4,33,789 ఎకరాలకు, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద 1,59,676 మంది రైతులు 3,97,901 ఎకరాలకు ప్రీమియం చెల్లించారు. పంటల బీమాకు సంబంధించి కేంద్రం వాటా ఎప్పటికప్పుడు విడుదలవుతోంది. చంద్రబాబు సర్కార్ 2023 ఖరీఫ్ నుంచి రాష్ట్రం వాటా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతులు బీమాకు దూరమయ్యారు.
మాకు నల్లరేగడి భూములు ఉన్నాయి. రబీలో ప్రధాన పంటగా పప్పు శనగ సాగు చేస్తాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రబీ కలసి వస్తుందని 15 ఎకరాల్లో పప్పు శనగ సాగుకు భూములను సిద్ధం చేసుకొని విత్తనాలు సమకూర్చుకున్నాం. రబీ సీజన్ మొదలై 42 రోజులు దాటింది. ఇంతవరకు చినుకు జాడ లేదు. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడకుంటే సిద్ధం చేసుకున్న శనగ విత్తనాలను అమ్ముకోవాల్సిందే. – శేషారెడ్డి, లక్ష్మిపురం, కల్లూరు మండలం
చివరగా సెప్టెంబర్ 3వ వారంలో
అక్కడక్కడ మోస్తరు వర్షం
భూమిలో తేమ లేకపోవడంతో
స్తంభించిన సాగు
ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో
31,385, నంద్యాల జిల్లాలో
60,241 హెక్టార్లలోనే పంటలు
గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే
గత నెలలో 3.95 మీటర్ల
భూగర్భంలోకి జలాలు
చంద్రబాబు ప్రభుత్వంలో అందని
పంటల బీమా పరిహారం


