శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని పాతాళగంగ వద్ద కృష్ణమ్మకు హారతి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణి నదీమాతల్లి విగ్రహానికి శుక్రవారం సాయంత్రం పూజలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు జరిపించారు. అలాగే పాతాళగంగ ఘాట్ వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు, ఏకాదశ హారతులు సమర్పించారు. అనంతరం నదీమాతల్లికి పూజలు, సారె సమర్పణ, దశహారతులు ఇచ్చారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి నదీమతల్లికి హారతులు ఇచ్చారు. ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతి ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.


